రేవంత్ రెడ్డి నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్ష!
మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రతిష్టాత్మక పోరులా మారింది. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ, ఖైరతాబాద్ ఎన్నికలపై ఈ ఎన్నిక ఫలితం ప్రభావం చూపనుంది. అధికారంలో ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించలేకపోయింది. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి పెద్ద పరీక్షగా మారింది.
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి పునరుద్ధరణ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ గ్రాడ్యుయేట్ స్థానం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే ఇక్కడ విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రెండో స్థానానికి లేదా అంతకంటే దిగువకు పరిమితమవుతూ వచ్చింది. 2007లో స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ విజయం సాధించగా, కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన పి. వేణుగోపాల్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2009లో వామపక్షాల మద్దతుతో ప్రొఫెసర్ నాగేశ్వర్ తిరిగి విజయం సాధించారు. 2015లో బీజేపీ అభ్యర్థి ఎన్. రామచందర్ రావు గెలుపొందగా, 2021లో బీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణి దేవి ఆయనను ఓడించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి నాలుగో స్థానానికి పడిపోయారు.
అయితే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. రంగారెడ్డి, హైదరాబాద్లో రెండు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. కానీ మహబూబ్ నగర్, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్సభ స్థానాల పరిధిలో మాత్రం నాగర్కర్నూల్ మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని ఎదురుదెబ్బలను చవిచూడాల్సి వచ్చింది.
ఈసారి ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ నాయకత్వం ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున సామ రామ్మోహన్ రెడ్డిని బరిలో దించింది. ఈ ఎన్నికలో గెలుపుకోసం భారీగా పరిశీలకులను నియమించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, నేరుగా ఫోన్ కాల్స్, మెసేజ్ల ద్వారా గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. యువతలో పెరుగుతున్న రాజకీయ చైతన్యానికి తగినట్లుగా యువ అభ్యర్థిని ఎంపిక చేయడం ద్వారా సత్తా చాటగలమని నమ్ముతున్నారు.
మరోవైపు బీజేపీ నుంచి గతంలో గెలిచిన ఎన్. రామచందర్ రావు వైపే ఆ పార్టీ మళ్లీ మొగ్గు చూపుతోంది. ఆయనకున్న సుదీర్ఘ అనుభవం, లోక్సభ స్థానాల వారీగా బీజేపీ సాధించిన ఓట్ల శాతం ఆ పార్టీకి కొండంత బలాన్నిస్తున్నాయి. అధికార పార్టీని సవాల్ చేస్తూ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని నిరూపించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక బీఆర్ఎస్ సైతం రెండు పార్టీలను గట్టిగా ఎదుర్కొనే సమర్థుడైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది.
అధికారంలో ఉండటం వేరు, పట్టణ ప్రాంత ఓటర్లు, విద్యావంతులను మెప్పించి గెలుపొందడం వేరు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ప్రభుత్వ పనితీరుకు మద్దతు ఇచ్చినట్లవుతుంది. ఒకవేళ ఓటమి ఎదురైతే మాత్రం, ప్రభుత్వ వైఫల్యానికి తీర్పుగానే భావించాల్సి ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఈ పోరు నుంచి ఎలా గట్టెక్కుతారో వేచి చూడాలి.








