మేడిగడ్డ మళ్లీ మొదటికొచ్చిందా?
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ భవితవ్యంపై ఒక స్పష్టత వచ్చింది. బ్యారేజీలోని 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించి, దాని స్థానంలో కొత్తగా నిర్మించడమే ఏకైక మార్గమని బ్యారేజీ సాంకేతిక పర్యవేక్షణ కమిటీ స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నేతలు దీన్నొక ఇంజనీరింగ్ అద్భుతమంగా ప్రచారం చేసుకున్నారని.. కానీ ఇది తెల్ల ఏనుగులా మారిందని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. మొత్తంగా ప్రజాధనాన్ని బుగ్గిపాలు చేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ కుంగిపోయింది. కొన్ని పిల్లర్లకు పగుళ్లు రావడంతో పాటు రాఫ్ట్ భాగం నది గర్భంలోకి వెళ్లిపోయింది. ఇది ప్రాజెక్టు నాణ్యతపై అనేక సందేహాలను రేకెత్తించింది. దీనిపై ప్రభుత్వం సాంకేతిక పర్యవేక్షణ కమిటీని నియమించింది. కేవలం మొక్కుబడి మరమ్మతులు చేస్తే సరిపోదని, దెబ్బతిన్న భాగాలను పూర్తిగా తొలగించి కొత్త నిర్మాణం చేపట్టాలని ఈ కమిటీ తేల్చిచెప్పింది. దెబ్బతిన్న పిల్లర్లను డైమండ్ సాట్తో కత్తిరించి తొలగించాలని సూచించింది. ఈ పునర్నిర్మాణ పనులకు కనీసం ఏడాది నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే, లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో కీలకమైన భాగం మళ్లీ మొదటికొచ్చినట్లయింది.
ఇది కేవలం సాంకేతిక లోపం, ఇంజనీరింగ్ వైఫల్యం మాత్రమే కాదని.. రాజకీయ కోణం కూడా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాటి పాలకుల అనాలోచిత నిర్ణయాలు, హడావుడి నిర్మాణాలు, కనీస భద్రతా ప్రమామాలను గాలికొదిలేయడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలోనూ స్టిల్లింగ్ బేసిన్ విస్తరణ, డయాఫ్రమ్ వాల్ నిర్మాణాలు చేపట్టాలని కమిటీ సూచించడం ద్వారా మిగతా బ్యారేజీలలోనూ లోపాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.
మరమ్మతుల డిజైన్లను 15 రోజుల్లో సిద్ధం చేసి, డిజైన్ల వెటింగ్ తర్వాత పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణ డిజైన్లకు సైతం సూత్రప్రాయ ఆమోదం లభించడంతో, రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుల పునర్నిర్మాణం కోసం ప్రభుత్వానికి భారీగా నిధులు అవసరమవుతాయి. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కు, తాజా పరిణామాలు రాజకీయంగా మరింత ఇరుకున పెట్టేలా కనిపిస్తున్నాయి.








