స్మార్ట్ఫోన్తో వీర్య పరీక్ష
స్మార్ట్ఫోన్ సాయంతో పురుషుల వీర్యాన్ని పరీక్షించి విశ్లేషించగలిగే చిన్న పరికరాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారు. అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్కు చెందిన పరిశోధకుల బృందం దీనిని రూపొందించింది. వీర్యాన్ని విశ్లేషించే సదుపాయాలు లేని దేశాల్లో ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ పరికరాన్ని పని చేయించేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించారు. చిన్న ట్రేలో వీర్యాన్ని నింపి పరికరంలో అమర్చిన తర్వాత దానిని స్మార్ట్ఫోన్కు అనుసంధానిస్తారు. ప్రత్యేక యాప్ ద్వారా దానిని విశ్లేషిస్తే వీరకణాల సంఖ్య తెలుస్తుంది. ఎవరికీ వారే సొంతగా పరీక్ష జరుపుకొనేలా యాప్ సహకరిస్తుంది. పరిశోధకులు ఇప్పటి వరకు దాదాపు 350 నమూనాలను పరీక్షించి చూడగా 98 శాతం ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయి. ఈ విధానం వల్ల ఖర్చు తగ్గుతుందని, సమయం ఆదా అవుతుందని పరిశోధకులు చెప్తున్నారు.













