ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ మాజీ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ భవనంలో లోకసభ కార్యదర్శికి ఆయన దరఖాస్తును సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు సీనియర్ బీజేపీ పార్టీ నేతలు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు వెంకయ్య, సుష్మాస్వరాజ్, గడ్కరీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, మురళీ మనోహర్ జోషీ, అద్వానీతో పాటు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం పళనిస్వామి, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌లు హాజరైన వారిలో ఉన్నారు.
రామ్‌నాథ్ నామినేషన్ మొదటి సెట్‌పై ప్రధాని మోదీ, రెండో సెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మూడోసెట్పై అమిత్ షా, నాలుగోసెట్పై ప్రకాశ్‌సింగ్ బాదల్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ.. ఎన్నికలో తనకు మద్దతిస్తున్నవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైనదని, బాబు రాజేంద్రప్రసాద్ వంటి మహామహులు ఆ పదవికి వన్నెతెచ్చారని పేర్కొన్నారు. తాను కూడా ఆ పదవి గౌరవాన్ని కాపాడుతానని అన్నారు.








