Anil Kumar Yadav: సైలెన్స్ బ్రేక్ చేసిన వైసీపీ సీనియర్లు.. దాడుల రాజకీయంపై అనిల్ కుమార్ ఘాటు స్పందన..
ఇటీవల మాజీ మంత్రులు అంబటి రాంబాబు (Ambati Rambabu), జోగి రమేష్ (Jogi Ramesh) నివాసాలపై జరిగిన దాడులు వైసీపీ శ్రేణుల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. కొంతకాలంగా బహిరంగంగా పెద్దగా స్పందించని పార్టీ నేతలు ఇప్పుడు వరుసగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. తమ నాయకులపై దాడులను ఖండిస్తూ, ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు ఇస్తుండటం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న సీనియర్ నేతలు కూడా ఇప్పుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుండటం కార్యకర్తలకు ధైర్యం ఇస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో నెల్లూరు (Nellore)కు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) మీడియాతో మాట్లాడిన తీరు వైసీపీ శ్రేణులను ఆకర్షించింది. ఆయన మాటల్లో కనిపించిన ఆగ్రహం, ఆవేశం పార్టీ కార్యకర్తల్లో పాత ఉత్సాహాన్ని తిరిగి తీసుకొచ్చిందని అంటున్నారు. మంగళవారం జోగి రమేష్ నివాసానికి వెళ్లి పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన అనిల్ కుమార్, తన వాగ్దాటితో పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపారు. ఎన్నికల తర్వాత ఈ స్థాయిలో ఆయన మాట్లాడటం ఇదే తొలిసారిగా కనిపించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో ఆయనను నెల్లూరు రూరల్ నుంచి నరసారావుపేట (Narasaraopet) పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ అధిష్టానం మార్చింది. అయితే అప్పటి రాజకీయ వాతావరణంలో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎక్కువ సమయం చెన్నై (Chennai)లో గడిపారని, సొంత ప్రాంతానికి వచ్చినప్పటికీ పెద్దగా రాజకీయ హడావుడి చేయలేదని చెబుతారు. కానీ తాజాగా జరిగిన పరిణామాలతో ఆయన మళ్లీ పూర్తిస్థాయిలో యాక్టివ్గా కనిపిస్తున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తిరుమల లడ్డూ (Tirumala Laddu) అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒత్తిడిలో ఉన్నారని అనిల్ కుమార్ ఆరోపించారు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు దిగుతున్నారని, నిజంగా ధైర్యం ఉంటే పోలీసులను పక్కన పెట్టి ఎదురుగా రావాలని సవాల్ విసిరారు. ఎక్కడికి పిలిచినా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు.
అయితే ఈ తరహా రాజకీయాలు మంచివికాదని కూడా ఆయన అన్నారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy) ఈ విధమైన దాడి రాజకీయాలకు పాల్పడలేదని గుర్తు చేశారు. కాపులు, బీసీ వర్గాల నేతలపై జరుగుతున్న దాడులు బాధాకరమని వ్యాఖ్యానించారు. మరో మూడు సంవత్సరాలు ఈ పరిస్థితులను భరిస్తామని, 2029లో ప్రజలు తగిన సమాధానం ఇస్తారని అన్నారు. వైసీపీ నేతలపై దాడులతో రాష్ట్రాన్ని అశాంతికి గురిచేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.






