కొత్త పెన్షన్ లు ఎక్కడ..? అంతా మోసం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. కేవలం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రజలను మోసం చేసేలా నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు ఇప్పుడు ఆ వర్గాలను పూర్తిగా వంచించారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి అనేది పూర్తిగా శూన్యమని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమం కోసం జరిగిన విప్లవాత్మకమైన కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, అలాగే 20 లక్షలకు పైగా పక్కా గృహాలను జగన్ ప్రభుత్వం మంజూరు చేసిందని స్పష్టం చేశారు. ఆనాటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే.. ఇప్పుడు అధికార పక్షం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.








