త్వరలోనే అమల్లోకి భారత్ – కివీ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..
భారత్-న్యూజిలాండ్ మధ్య వాణిజ్య సంబంధాల్లో కీలక ముందడుగు పడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అమలుకు అవసరమైన బిల్లును న్యూజిలాండ్ పార్లమెంట్ ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 93 మంది ఎంపీలు ఓటేయగా.. 29 మంది వ్యతిరేకించారు. ఒప్పందం అమల్లోకి రావడంతోనే .. న్యూజిలాండ్ నుంచి భారత్‌కు వెళ్లే ఎగుమతుల్లో 57 శాతానికి సుంకం ఉండదు. పూర్తిస్థాయిలో అమలు జరిగితే 95 శాతం ఎగుమతులపై సుంకాలు పూర్తిగా తొలగిపోవడం లేదా భారీగా తగ్గడం జరుగుతుంది. దీంతో భారత మార్కెట్లో న్యూజిలాండ్ ఉత్పత్తులకు మరింత అవకాశం దక్కనుంది.
భారత్‌లో పెరుగుతున్న మధ్యతరగతి.. న్యూజిలాండ్ ఎగుమతిదారులకు పెద్ద మార్కెట్‌గా మారుతోందని న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడుల మంత్రి టాడ్ మెక్లే చెప్పారు. ఆహారం, టెక్నాలజీ, విద్య, పర్యాటకం, ప్రొఫెషనల్ సర్వీసెస్‌కు భారత్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను న్యూజిలాండ్ కంపెనీలు ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
ముఖ్యంగా కివీ పండ్ల పరిశ్రమకు ఈ ఒప్పందం భారీ ఊరటనివ్వనుంది. వచ్చే ఐదేళ్లలో సుంకాల రూపంలో సుమారు 125 మిలియన్ న్యూజిలాండ్ డాలర్లు ఆదా అవుతాయని అంచనా. సరిహద్దుల్లో సరకుల తనిఖీ, క్లియరెన్స్ ప్రక్రియ కూడా వేగవంతం కానుంది.
ఇరు దేశాల ఆమోద ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఎఫ్‌టీఏ అమల్లోకి వస్తుంది. ఈ ఏడాది చివర్లోనే ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని మెక్లే చెప్పారు. 2030 నాటికి భారత్-న్యూజిలాండ్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని తెలిపారు.








