Mudragada: చంద్రబాబుకు ముద్రగడ లేఖ.. సోషల్ మీడియాలో సెటైర్లు
ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి వార్తల్లో నిలిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను ఉద్దేశించి ఆయన రాసిన తాజా లేఖ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ లేఖలో ఆయన లేవనెత్తిన అంశాల కంటే, ఆయన పేరు మార్పు, తిరుమల లడ్డూ వ్యవహారంపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి.
ముద్రగడ తన లేఖలో ప్రస్తుత ప్రభుత్వ పాలనను రాక్షస పాలనగా అభివర్ణించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏపీలో ఎమర్జెన్సీ విధించాలని ఆయన ప్రధానమంత్రిని డిమాండ్ చేయడం గమనార్హం. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజిని వంటి వారిపై జరుగుతున్న విచారణలను ఆయన తప్పుబట్టారు.
ముఖ్యంగా, కాపు సామాజికవర్గాన్ని ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ముద్రగడ ఆరోపించారు. గతంలో తన కుటుంబాన్ని, ప్రస్తుతం అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేస్తున్నారని, కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు గతంలో మోసం చేశారని ఆయన విమర్శించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ముద్రగడ తన లేఖలో కాపు కులం గురించి ప్రస్తావించడంపై సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ చేసి, ఓటమి అనంతరం తన పేరును “ముద్రగడ పద్మనాభ రెడ్డి”గా మార్చుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, స్వచ్ఛందంగా తన కుల గుర్తింపును వదులుకుని ‘రెడ్డి’గా పేరు మార్చుకున్న వ్యక్తికి, ఇప్పుడు మళ్లీ కాపు జాతి ప్రయోజనాల గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. “కులాన్ని కాలదన్ని మరో కులం పేరును తగిలించుకున్న వ్యక్తి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని కాపులను టార్గెట్ చేస్తున్నారని అడుగుతారు?” అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రాజకీయ ఉనికి కోసమే ఆయన మళ్లీ కుల సమీకరణాలను తెరపైకి తెస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో సీబీఐ రిపోర్టు వచ్చిందని, నెయ్యి కల్తీ జరగలేదని తేలిపోయిందని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు ఆడిన ఈ అబద్ధం వల్ల పార్టీకి నష్టం జరిగిందని ఆయన విమర్శించారు. అయితే, ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఆయనను బుక్ చేస్తున్నాయి.
వాస్తవానికి, తిరుమల నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ (SIT) విచారణ జరుగుతోంది తప్ప, లడ్డూలో కల్తీ జరగలేదని ఎలాంటి అధికారిక సంస్థ నివేదిక ఇవ్వలేదు. గుజరాత్ ల్యాబ్ రిపోర్టులో జంతువుల కొవ్వు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించిన విషయాన్ని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. వాస్తవాలను వక్రీకరించి, కేవలం ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే ముద్రగడ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు.
ముద్రగడ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసినప్పటికీ, అందులో పేర్కొన్న అంశాల కంటే ఆయన వైఖరిపైనే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు కాపు ఉద్యమ నేతగా గౌరవం పొందిన ఆయన, ఇప్పుడు వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం తన సొంత కులాన్ని, విశ్వాసాలను పణంగా పెడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.






