TTD: నకిలీ నెయ్యి వ్యవహారం ఉత్కంఠ..టీటీడీ ఈవో బదిలీ, కొత్త ఈవో నియామకం..
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం మరో కీలక దశకు చేరుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేయడంతో అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నెల్లూరు కోర్టు (Nellore Court)లో చార్జిషీట్ దాఖలు కావడం, మరోవైపు రాజకీయ వర్గాల్లో పరస్పర ఆరోపణలు కొనసాగుతుండటంతో ఈ కేసు ప్రాధాన్యం మరింత పెరిగింది.
సీబీఐ సిట్ విచారణలో భాగంగా గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams)లో కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారుల పాత్రపై దృష్టి సారించింది. అప్పటి ఈవోలుగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal), ధర్మారెడ్డి (Dharma Reddy)తో పాటు మరికొందరు అధికారులపై చర్యలు తీసుకోవాలని సీబీఐ స్పష్టంగా సూచించింది. ఈ సిఫార్సులపై ప్రభుత్వం రెండు రోజులుగా ఆలోచనలో ఉండగా, కోర్టులో కేసు విచారణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వెంటనే నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ప్రస్తుతం టీటీడీ ఈవోగా (TTD EO) ఉన్న అనిల్ కుమార్ సింఘాల్‌ను తక్షణమే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు ప్రత్యామ్నాయ పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించడం గమనార్హం. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర (Muddada Ravichandra)ను కొత్త టీటీడీ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ (Vijayanand) ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
ఇక ధర్మారెడ్డి ఇప్పటికే పదవీ విరమణ పొందిన నేపథ్యంలో, ఆయనకు తాఖీదులు జారీ చేసి వివరణ కోరే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. సీబీఐ సూచనల మేరకు ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అనిల్ కుమార్ సింఘాల్ విషయానికి వస్తే, ఆయన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో వైసీపీ పాలనలోనూ టీటీడీ ఈవోగా పనిచేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే తాజాగా సీబీఐ సిట్ విచారణలో ఆయనను ప్రశ్నించగా, లడ్డూ నెయ్యి విషయంలో తన వ్యక్తిగత పాత్ర లేదని, అప్పటి టీటీడీ బోర్డు నిర్ణయాలనే అమలు చేశామని స్పష్టం చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ సీబీఐ తీవ్ర స్థాయిలో సిఫార్సులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం ఆధ్యాత్మిక విశ్వాసాలకు సంబంధించిన అంశం కావడంతో ప్రజల్లో ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.






