ప్రముఖ విద్యావేత్త మంగాదేవి కన్నుమూత
ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవకురాలు, రచయిత్రి డాక్టర్ నన్నపనేని మంగాదేవి (Nannapaneni Mangadevi) (89) కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా గుంటూరు కేంద్రంగా విద్యా, సాహిత్య, సామాజిక సేవా రంగాల్లో మంగాదేవి విశేష సేవలందించారు. గుంటూరు బ్రాడీపేటలో శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ను ఏర్పాటుచేయడం ద్వారా దేశానికి గొప్ప మేధావులను, ఉన్నత విద్యావంతులను అందించారు. ఈ విద్యాసంస్థను ఆమె 1965లో ఒక బాలికతో ప్రారంభించారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, స్వతంత్ర ఆలోచన, సృజనాత్మకత పెంపొందించేలా వినూత్న విద్యా విధానాలను ఆ విద్యాసంస్థలో ప్రవేశపెట్టారు.
మదర్ థెరెసా (Mother Teresa) స్ఫూర్తితో 1990లో చేతన చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. విద్య, ఆరోగ్యం, మహిళా సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి ఈ ట్రస్టు ద్వారా విశేష కృషి చేశారు. బాలల కోసం సుమారు 25 పుస్తకాలు రచించారు. బాలల్ని ప్రొత్సహించడానికి, సంగీత, సాహిత్యాభివృద్ధి కోసం ఏటా రాష్ట్రస్థాయిలో లలిత కళాఉత్సవాలను మంగాదేవి నిర్వహిస్తున్నారు. 1937 జూలై 1న తెనాలిలో జన్మించిన మంగాదేవి ఖ్యాతి గుంటూరు జిల్లాను దాటి దేశమంతా వ్యాపించింది. విద్య, సాహిత్యం, సేవా రంగాల్లో ఆమె అందించిన మహోన్నత సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
మంగాదేవి మృతిపై రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. విద్యావేత్త డా. ఎన్. మంగాదేవి గారు భౌతికంగా మనకు దూరమయ్యారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మానవతామూర్తి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులు, బాలకుటీర్ కుటుంబం అందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేచేశారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, భాష్యం విద్యాసంస్థల చైర్మన్, ఎంపీ భాష్యం రామకృష్ణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) తదితరులు మంగాదేవి మృతి పట్ల సంతాపం తెలిపారు.







