సైకలాజికల్ థ్రిల్లర్‌గా RC17.. నెగెటివ్ షేడ్స్‌లో రామ్ చరణ్?
రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథ, కథనం, రామ్ చరణ్ నటనతో ఆ సినిమా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతుండటంతో అభిమానుల దృష్టి అంతా ఈ ప్రాజెక్ట్‌పైనే ఉంది.
ప్రస్తుతం #RC17 పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. అయితే సినిమా ప్రారంభం కాకముందే దీనికి సంబంధించిన ఒక్కో వార్త సోషల్ మీడియాని ఊపేస్తోంది. ముఖ్యంగా ఈసారి సుకుమార్ ఎలాంటి కథను ఎంచుకున్నారు? రామ్ చరణ్‌ను ఏ తరహా పాత్రలో చూపించబోతున్నారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
సైకలాజికల్ థ్రిల్లర్‌గా RC17?
తాజా సమాచారం ప్రకారం.. సుకుమార్ ఈ సినిమాను ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణ కమర్షియల్ కథకు భిన్నంగా మానసిక సంఘర్షణలు, ఊహకు అందని థ్రిల్లింగ్ మలుపులతో కథను నడిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.
నెగెటివ్ షేడ్స్‌లో రామ్ చరణ్?
అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని సమాచారం. సుకుమార్ గతంలో తెరకెక్కించిన ‘ఆర్య 2’లో అల్లు అర్జున్ పాత్రలో కనిపించిన డార్క్ నేచర్ తరహాలోనే రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ ఉండబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇదే నిజమైతే రామ్ చరణ్ కెరీర్లో మరో విభిన్నమైన పాత్రను చూడబోతున్నామనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలకు భిన్నంగా ఉండే ఈ క్యారెక్టరైజేషన్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది.
ఇవి కూడా చదవండి
హీరోయిన్గా సాత్విక వీరవల్లి పేరు?
మరోవైపు ఈ సినిమా నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కథానాయిక పాత్ర కోసం అన్వేషణ జరుగుతుండగా, ‘ఆకాశంలో ఒక తార’ ఫేమ్ సాత్విక వీరవల్లి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె ఈ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల ఎంపికపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మొత్తానికి ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో #RC17పై భారీ ఆసక్తి నెలకొంది. సైకలాజికల్ థ్రిల్లర్, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అనే వార్తలు నిజమవుతాయా? ఈసారి సుకుమార్ రామ్ చరణ్‌ను ఎలా చూపించబోతున్నారు? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







