ఏపీకి మెగా ప్రాజెక్ట్.. 3వ అతిపెద్ద ‘డిజిటల్ ల్యాండింగ్ హబ్’గా వైజాగ్..!
ఆంధ్రప్రదేశ్ సాంకేతిక, డిజిటల్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. గ్లోబల్ టెక్ దిగ్గజాలు ‘గూగుల్'(Google), ‘మైక్రోసాఫ్ట్'(Microsoft) సంయుక్తంగా రాష్ట్రంలో భారీ సబ్‌సీ ఇంటర్నెట్ కేబుల్ నెట్‌వర్క్‌ను మరియు డేటా సెంటర్ మౌలిక వసతులను నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ మెగా ప్రాజెక్టులతో ముంబై, చెన్నై నగరాల తర్వాత భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడవ అంతర్జాతీయ ‘డిజిటల్ ల్యాండింగ్ హబ్’గా ఆంధ్రప్రదేశ్ అవతరించబోతోంది.
ఈ భారీ ప్రాజెక్టు ద్వారా గ్లోబల్ ఇంటర్నెట్ మ్యాప్‌లో విశాఖపట్నం నగరం ఒక గ్లోబల్ డిజిటల్ కారిడార్‌గా మారనుంది. ఈ బృహత్తర ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ సంస్థ తన ప్రతిష్టాత్మక ‘అమెరికా-ఇండియా కనెక్ట్’ నెట్‌వర్క్‌తో కూడిన సరికొత్త ‘కేబుల్ ల్యాండింగ్ స్టేషన్’, అలాగే ఏఐ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. దీనితో పాటు మైక్రోసాఫ్ట్ సంస్థ సైంట్టెల్ మరియు లైట్‌స్టార్మ్ కంపెనీలతో కలిసి దాదాపు 3,600 కిలోమీటర్ల పొడవైన ‘ఇండియా-సౌత్ ఈస్ట్ ఏషియా’ సబ్‌మెరైన్ కేబుల్ వ్యవస్థను తీరానికి అనుసంధానించనుంది.
ఈ భారీ కేబుల్ నెట్వర్క్ వ్యవస్థ ద్వారా విశాఖపట్నం నుండి సింగపూర్, ఆగ్నేయాసియా మరియు అమెరికా దేశాలకు అత్యంత వేగవంతమైన డైరెక్ట్ డిజిటల్ కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని అంతర్జాతీయ డిజిటల్ హబ్‌గా మార్చేలా ప్రభుత్వం ఈ మౌలిక సదుపాయాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గూగుల్ సంస్థ ఇక్కడ నిర్మించతలపెట్టిన 1 గిగావాట్ సామర్థ్యం గల మెగా డేటా సెంటర్ క్యాంపస్ పనుల మొదటి దశను 2028 మధ్య నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖపట్నంలో రాబోతున్న ఈ సరికొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్లు, సబ్‌సీ కేబుల్ కారిడార్ల ద్వారా అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలు ఏపీకి క్యూ కట్టే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్రంలో వేలాది మంది ఐటీ మరియు సాంకేతిక నిపుణులకు సరికొత్త హై-టెక్ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.








