జెన్-జీ యువతతో వినూత్నంగా రాఖీ వేడుకలు జరుపుకున్న ఎంపీ సానా సతీష్ బాబు
ప్రతి ఏటా రాఖీ పండుగను వినూత్నంగా జరుపుకునే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఈ ఏడాది కాకినాడ జిల్లాకు చెందిన జెన్-జీ యువతతో ప్రత్యేకంగా రాఖీ వేడుకలు నిర్వహించారు.
కొప్పవరం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన జెన్ జీ కాలేజీ విద్యార్థినులు పాల్గొని ఎంపీ సానా సతీష్ బాబుకు రాఖీలు కట్టారు. అనంతరం వారితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ స్నేహపూర్వకంగా ముఖాముఖి ముచ్చటించారు.
ఈ సందర్భంగా జెన్-జీ యువత ఆకాంక్షలు, కెరీర్ లక్ష్యాలు, విద్య, ఉపాధి అవకాశాలు, కాకినాడ అభివృద్ధిపై వారి ఆలోచనలు తదితర అంశాలను ఎంపీ సానా సతీష్ బాబు అడిగి తెలుసుకున్నారు. యువతతో వారి శైలిలోనే సరదాగా, ఆత్మీయంగా మాట్లాడారు.
కాకినాడలో యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, నైపుణ్యాభివృద్ధి మరియు కొత్త తరహా అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, యువనేత, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా పాల్గొన్న జెన్ జీ యువతకు గిఫ్టులు, చాక్లెట్లు అందజేసి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.
యువతతో కేవలం పండుగ వేడుకగా కాకుండా, వారి ఆలోచనలు వినడం, వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవడం, భవిష్యత్ కాకినాడపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేమని ఎంపీ సానా సతీష్ బాబు తెలిపారు.








