జలవివాదాలపై ఢిల్లీ వేదికగా మరో కీలక భేటీ!
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు 12 ఏళ్లు గడుస్తున్నా.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల పంపకాలు, ప్రాజెక్టుల వివాదాలు మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఉమ్మడి ఆస్తుల పంపకం కంటే అత్యంత సున్నితమైన, సంక్లిష్టమైన నీటి పంపకాల సమస్య ప్రతీ ఏటా వివాదాస్పదమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ముమ్మర చర్యలు ప్రారంభించింది. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన 12 మంది సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ రెండో విడత సమావేశానికి రంగం సిద్ధమైంది.
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఢిల్లీలోని సేవాభవన్ వేదికగా సెప్టెంబరు 7న ఈ కీలక సమావేశం జరగనుంది. గత ఏడాది జులై 16న కేంద్ర జల్‌శక్తి మంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య ఢిల్లీలో అత్యున్నత స్థాయి భేటీ జరిగింది. ఏపీ ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల (ప్రస్తుతం నల్లమలసాగర్) అనుసంధాన ప్రాజెక్టుతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులపై చెలరేగిన తీవ్ర వివాదాల నేపథ్యంలో ఆ సమావేశం కొనసాగింది. సీఎంల భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో 12 మంది సభ్యులతో ప్రత్యేక జలవివాద పరిష్కార కమిటీని నియమించింది.
ఈ 12 మంది సభ్యుల కమిటీలో కేంద్ర జల సంఘం చైర్మన్ కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ప్రతినిధులు, తెలంగాణ నుంచి నలుగురు ప్రతినిధులు, కేంద్ర జల్‌శక్తి శాఖ నుంచి మరో ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ తొలి సమావేశం ఈ ఏడాది జనవరి 30న జరిగింది. ఆ సమావేశంలో ప్రాథమికంగా కొన్ని అంశాలపై చర్చించినప్పటికీ, ఉభయ రాష్ట్రాలు తమ సమగ్ర ఎజెండా అంశాలను సమర్పించలేదు. తొలి సమావేశం ముగిసిన తర్వాత కూడా ఎజెండా వివరాలు పంపాలని కేంద్రం పలుమార్లు కోరినా రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదని కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ రాకేష్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో జనవరి 30 నాటి తొలి సమావేశంలో చర్చించిన అంశాల ప్రాతిపదికగానే సెప్టెంబరు 7న రెండో సమావేశాన్ని నిర్వహించనున్నారు.
2014 విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు దశాబ్దానికి పైగా పనిచేస్తున్నా క్షేత్రస్థాయిలో పూర్తి అధికారాలు అమలులోకి రాలేకపోయాయి. కృష్ణా జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల నీటిని 512:299 నిష్పత్తిలో తాత్కాలికంగా పంచుకుంటూ వస్తున్నప్పటికీ, శాశ్వత వాటాల ఖరారుపై ట్రిబ్యునల్ విచారణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు పోలవరం-బనకచర్ల అనుసంధానం, పాలమూరు-రంగారెడ్డి, డిండి, రాయలసీమ ఎత్తిపోతల వంటి ప్రాజెక్టుల డీపీఆర్‌లు, విద్యుదుత్పత్తి వినియోగం, వరద జలాల మళ్లింపు వంటి అంశాలపై రెండు రాష్ట్రాలు పరస్పర ఫిర్యాదులతో న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లను ఆశ్రయిస్తూనే ఉన్నాయి.
సమస్య జఠిలంగా మారుతున్న వేళ, రెండు రాష్ట్రాలూ ఎజెండా సమర్పించడంలో నిర్లక్ష్యం వహించడం సమస్య పరిష్కారాన్ని మరింత ఆలస్యం చేస్తోంది. విభజన సమస్యలకు రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా, రైతు ప్రయోజనాలే పరమావధిగా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనంతో వ్యవహరించాల్సి ఉంది. సెప్టెంబరు 7న ఢిల్లీలో జరగబోయే ఈ సమావేశమైనా తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దానికి పైగా నలుగుతున్న జల వివాదాలకు శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపుతుందో లేదో వేచి చూడాలి.








