టోల్ సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరుల వీరంగం.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..!
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్గేట్ వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకున్న దాడి ఘటన రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) అమిలినేని సురేంద్రబాబు అనుచరులు, గన్‌మెన్ టోల్ సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడికి దిగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) తీవ్రంగా స్పందించారు. అధికార గర్వంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
ఘటన వివరాల్లోకి వెళితే.. తిరుమల దర్శనం ముగించుకుని వెళ్తున్న ఎమ్మెల్యే వాహన శ్రేణిని టోల్ ఫీజు కోసం సిబ్బంది ఆపారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు, గన్‌మెన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో టోల్ మేనేజర్ రవిని కొట్టడమే కాకుండా, అడ్డువచ్చిన మహిళా ఉద్యోగి శ్రీలతపై కూడా చేతులెత్తారు. మేనేజర్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ తరహాలో తీసుకువెళ్లడం అక్కడ ఉన్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళా ఉద్యోగిపై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తక్షణమే దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ప్రజాప్రతినిధుల అనుచరులమని చెప్పుకుంటూ సామాన్యులపై దౌర్జన్యం చేస్తే ఊరుకోమని, ఇది ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే చర్య అని సీఎం స్పష్టం చేశారు.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, గన్‌మెన్ ప్రవర్తనపై కూడా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం వేగంగా స్పందించి చర్యలకు ఆదేశించడం గమనార్హం.








