బ్యాలెట్ ఇచ్చిన అఖండ విజయం ఇది: చంద్రబాబు..!
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో(Election Results) అధికార ఎన్డీయే కూటమి సాధించిన చారిత్రాత్మక విజయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) హర్షం వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల ఫలితాలు ‘మంచి రాజకీయాలు సుపరిపాలనకు నాంది’ అనే విషయాన్ని మరోసారి స్పష్టంగా రుజువు చేశాయని పేర్కొన్నారు. స్థానిక పోరులో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి, ఇంతటి భారీ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ ఎన్నికల్లో కూటమి ఏకంగా 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గర్వంగా ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పోలిస్తే.. ఈ రెండున్నరేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వానికి ప్రజాదరణ మరింత పెరిగిందని, పెరిగిన ఓట్ల శాతమే ఇందుకు సజీవ సాక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఈ గెలుపును తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తూ.. ఇది ఈవీఎంలు కాదు, నేరుగా ‘బ్యాలెట్ పేపర్’ ద్వారా ప్రజలు ఇచ్చిన స్వచ్ఛమైన విజయం అని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా ఓటమిని అంగీకరించి, ప్రభుత్వంపై లేనిపోని అభాండాలు, అక్రమ ఆరోపణలు చేయడం మానుకోవాలని ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు.
రాష్ట్రంలో తాము చేపడుతున్న అభివృద్ధికి ఆమోదముద్రగా, అందిస్తున్న సుపరిపాలనకు దక్కిన గౌరవంగా ఈ ఫలితాలను భావిస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. ఒకవైపు ఎన్నికల హడావుడి ఉన్నప్పటికీ, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాము వెనకడుగు వేయకుండా సహాయక చర్యలు చేపట్టామని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలను ఆదుకున్నామని గుర్తుచేశారు. రాయలసీమ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ రతనాలసీమగా మారుస్తున్నామని, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చేలా మరింత వేగంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.






