Bolisetty Satyanarayana: జనసేనకు బొలిశెట్టి సత్యనారాయణ ‘తాత్కాలిక’ గుడ్ బై..! ఏం జరిగింది?
జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ తీసుకున్న తాత్కాలిక రాజీనామా నిర్ణయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఆయన చెప్పిన కారణానికి, తెర వెనుక జరుగుతున్న ప్రచారానికి మధ్య పొంతన లేకపోవడంతో జనసేన వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పవన్ కల్యాణ్ వెంటే ఉంటూ, వివిధ చర్చా వేదికలపై పార్టీ గళాన్ని బలంగా వినిపించిన బొలిశెట్టి సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను పార్టీకి తాత్కాలికంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచారు. అయితే, ఆయన రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం పర్యావరణ ప్రేమా లేక పార్టీ అంతర్గత విభేదాలా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బొలిశెట్టి సత్యనారాయణ తన రాజీనామాకు ఒక ఆసక్తికరమైన సాంకేతిక కారణాన్ని సాకుగా చూపారు. గతంలో ఆయన ఉత్తరాంధ్రలోని కాలుష్య సమస్యలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో రాష్ట్ర పర్యావరణ శాఖ ప్రధాన ప్రతివాదిగా ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు తాను పార్టీలో ఉంటూనే, తన పార్టీ అధినేత పర్యవేక్షణలో ఉన్న శాఖపై న్యాయపోరాటం చేయడం నైతికంగా సరికాదని, ఇది ఇబ్బందులకు దారితీస్తుందని బొలిశెట్టి పేర్కొన్నారు. అందుకే కేసు ముగిసే వరకు తాను పార్టీకి దూరంగా ఉంటానని, అయితే పవన్ కల్యాణ్ ఆశయాల కోసమే పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.
బొలిశెట్టి చెప్పిన కారణం పైకి నైతికంగా కనిపిస్తున్నప్పటికీ, పార్టీ వర్గాల్లో మాత్రం మరో ప్రచారం బలంగా సాగుతోంది. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా జనసేన కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై బొలిశెట్టి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలే ఈ రాజీనామాకు పునాది అని తెలుస్తోంది. రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బలంగా ఉండాలని పవన్ కల్యాణ్ పదేపదే చెప్తున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, బహిరంగ విమర్శలు చేయవద్దని నేతలకు గట్టిగా సూచించారు. ఇటీవల మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో బొలిశెట్టి వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కూటమిలో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం క్రమశిక్షణారాహిత్యమేనని భావించిన అధినేత, బొలిశెట్టికి గట్టి హెచ్చరికలే జారీ చేశారని టాక్. పార్టీ కోసం ఎంతో కాలంగా కష్టపడుతున్న తనను, బహిరంగంగా అందరి ముందు మందలించడంపై బొలిశెట్టి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ అవమానం భరించలేకే ఆయన సాంకేతిక కారణాన్ని వెతుక్కుని పార్టీ నుంచి బయటకు వచ్చారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బొలిశెట్టి వ్యాఖ్యల వెనుక కేవలం కార్యకర్తల ఆవేదనే ఉందా లేక ఇతర రాజకీయ శక్తుల ప్రేరణ ఉందా అన్న కోణంలోనూ జనసేన పార్టీ ఆరా తీస్తోంది. పవన్ కల్యాణ్ ప్రతిష్టను దెబ్బతీయడానికి లేదా కూటమిలో చిచ్చు పెట్టడానికి ఎవరైనా ఆయనను పావుగా వాడుకుంటున్నారా అనే అనుమానాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆయన రాజీనామాను వారించకుండా, సున్నితంగా ఆమోదించే దిశగానే పార్టీ అడుగులు వేస్తోంది.
బొలిశెట్టి సత్యనారాయణ రాజీనామా జనసేనలో అంతర్గత ప్రజాస్వామ్యానికి, క్రమశిక్షణకు మధ్య జరుగుతున్న సంఘర్షణకు అద్దం పడుతోంది. పర్యావరణ కేసు పేరుతో ఆయన గౌరవప్రదంగా తప్పుకున్నారా, లేక భవిష్యత్తులో మరేదైనా రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం ఈ పరిణామం జనసేన కేడర్లో చర్చనీయాంశంగా మారింది.






