తొలి సెట్ పై మోడీ.. రెండో సెట్ పై చంద్రబాబు
అధికార ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీజీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్ పేరును అనూహ్యంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బిహార్ గవర్నర్‌గా ఉన్న రామ్‌నాథ్ ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ఆయన మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. రామ్‌నాథ్‌ను ఎన్డీయే అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ తొలి నామినేషన్ సెట్‌పై ప్రధాని మోడీ సంతకం చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లనున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో నామినేషన్ సెట్‌పై సంతకం చేయనున్నారు. మూడో సెట్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, నాలుగో సెట్‌పై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రశాశ్సింగ్ బాదల్ సంతకాలు చేయనున్నారు.








