నరసింహన్‌కు కీలక పదవి!
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మరింత కీలక బాధ్యత చేపట్టనున్నారని తెలుస్తోంది. రాజ్యాంగ పదవి నుంచి కేబినెట్ ర్యాంకు స్థాయి కలిగిన పదవిలోకి ఆయన్ను తీసుకుంటారని జోరుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉహాగానాలకు మరింత బలమిచ్చేలా ఆయన గంటకు పైగా ప్రధాని కార్యాలయంలో మంతనాలు సాగించారు. మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన గవర్నర్ అనంతరం ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేందర్ సింగ్‌తో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వంలోని అధికార వర్గాల ద్వారా అందుతున్న సమచారం మేరకు నరసింహన్‌కు అంతర్గత భద్రతా సలహాదారుగా నియమించే అవకాశముందని తెలుస్తోంది. 1968 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా పనిచేసిన నరసింహన్, సుదీర్ఘకాలం పాటు కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స బ్యూరో)లో పనిచేశారు. 2006 డిసెంబర్ 31న పదవీ విరమణ పొందే వరకు ఐబీలో వివిధ ర్యాంకుల్లో పనిచేసిన నరసింహన్ ఆ విభాగాధిపతిగానూ సేవలందించారు. అంతర్గత భద్రతపై విశేషానుభవం కల్గిన నరసింహన్ సేవల్ని అంతర్గత భద్రత కోసమే ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.








