పెట్టుబడులు ఊపందుకోకపోవడంపై దృష్టి – జైట్లీ
దేశంలో ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకోకపోవడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆర్థికాభివృద్ధిని గాటన పెట్టేందుకు మంత్రివర్గ సహచరులతో పాటు సీనియర్ అధికారులతో విస్తృత సంప్రదింపులు జరుపుతున్న జైట్లీ, రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా వస్తు, సేవల పన్ను (జిఎస్టి) పరిధిలోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం కేంద్రంలో అధికార పగ్గాలను చేపట్టిన మొదటి రోజు నుంచే ఎంతో చురుకుగా పనిచేస్తోంది. ఆర్థికంగా ఎదురవుతున్న ఒడిదుడుకులను మేము విశే్లషిస్తున్నాం. వీటిని పరిష్కరించేందుకు సరైన సమయంలో తగిన చర్యలు చేపడతాం’ అని పెట్టుబడిదారుల సమావేశంలో జైట్లీ పేర్కొన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.













