జోసెఫ్ రావణ్ కేసులో ఊహించని మలుపు..!
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ‘ప్రశ్న’(Prashna) యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రసన్న రావణ్ కేసు విచారణలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రావణ్‌ను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై గన్నవరం కోర్టులో విచారణ జరిగింది. అయితే, నాటకీయ పరిణామాల మధ్య ఆ కస్టడీ పిటిషన్‌ను తాము వెనక్కి (ఉపసంహరణ) తీసుకుంటున్నట్లు పోలీసుల తరఫు న్యాయవాది న్యాయస్థానానికి అధికారికంగా తెలియజేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు మావోయిస్టు భావజాల వ్యాప్తి, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా మాట్లాడారనే తీవ్రమైన ఆరోపణలపై గన్నవరం పోలీసులు రావణ్‌పై ఉపా (UAPA) చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ కేసు మూలాలను, ఆర్థిక లావాదేవీలను వెలికితీసేందుకు 10 రోజుల పోలీసు కస్టడీ అవసరమని గత శుక్రవారం పోలీసులు కోరారు. అయితే, ఈ కేసులో ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమనతో పాటు పలువురు కీలక వ్యక్తులను గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో పోలీసులు ఇప్పటికే సుదీర్ఘంగా విచారించి అవసరమైన వివరాలు, డిజిటల్ ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే రావణ్ కస్టడీ అవసరం లేదని భావించి పోలీసులు వెనక్కి తగ్గినట్లు న్యాయవర్గాల్లో చర్చ సాగుతోంది. పోలీసులు కస్టడీ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో జోసెఫ్ రావణ్ ప్రస్తుతానికి నెల్లూరు సెంట్రల్ జైల్లోనే జ్యుడీషియల్ రిమాండ్‌లో కొనసాగనున్నారు. మరోవైపు, ఈ కేసులో ప్రభుత్వం కావాలనే ఉపా వంటి కఠిన చట్టాలను అక్రమంగా ప్రయోగిస్తోందని రావణ్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టు వెలుపల తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై నమోదైన పలు కేసులను ఒకే కేసుగా విచారించాలని కోరుతూ రావణ్ ఇప్పటికే ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. పోలీసుల తాజా ఉపసంహరణ నిర్ణయంతో ఈ పొలిటికల్ అండ్ లీగల్ డ్రామా ఏ మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.








