కూటమి ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన‘ప్రశ్న’ గ్యాంగ్..!
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న ‘ప్రశ్న’(Prashna) యూట్యూబ్ ఛానల్ బ్లాక్మెయిలింగ్, వేధింపుల కేసు విచారణలో తాజాగా మరో సంచలన నిజాన్ని వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం టీడీపీ(TDP) ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును వ్యక్తిగతంగా, రాజకీయంగా దెబ్బతీయడానికి ఈ యూట్యూబ్ ముఠా పెద్ద ఎత్తున కుట్ర పన్నినట్లు అంతర్గత విచారణలో బయటపడింది. ‘ప్రశ్న’ నిర్వాహకుడు జోసెఫ్ అలియాస్ రావణ్, అతని అనుచరులు చాలా కాలంగా ఎమ్మెల్యేకు వేధింపులు గురిచేసినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
ఎమ్మెల్యే సురేంద్ర బాబుపై సమాజంలో అప్రతిష్ట తెచ్చేలా తప్పుడు అవినీతి ఆరోపణలతో వీడియోలు రూపొందించడం వెనుక కీలక సూత్రధారుల లింకులు బయటపడ్డాయి. ఈ కుట్ర వెనుక వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడి సోదరుడు ఇంద్రసేన నాయుడు ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయి. ఆయనతో పాటు ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానల్ సీఈవో గమన కూడా ఈ ప్లాన్లో భాగస్వామి అయి, తెరవెనుక స్క్రిప్ట్ డిజైనింగ్, ఫండింగ్ వ్యవహారాలను నడిపించినట్లు జిల్లావ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది.
కూటమి ప్రభుత్వానికి చెందిన ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తూ విపక్షాలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న ఇటువంటి విష ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకే పార్టీ నేతలకు సూచించారు. తాజా పరిణామాల నేపథ్యంలో గమన, ఇంద్రసేన నాయుడుల వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ డిజిటల్ నెట్వర్క్ వెనుక ఉన్న మరికొంతమంది కీలక వ్యక్తుల కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలను వెలికితీసేందుకు గన్నవరం పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.








