పరారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే..!
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పాత జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన ఉదంతం రాజకీయంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని మార్చేందుకు కుట్ర పన్నారనే బలమైన అభియోగాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై(Sidiri Appalaraju) పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చినప్పటి నుండి అప్పలరాజు పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు మరెవరో కాదు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చిన్న కుమారుడు ఆరవ్. గత శుక్రవారం రాత్రి ఆరవ్ అతివేగంగా బైక్ నడుపుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న దానయ్యను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో దానయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే, ప్రమాదం జరిగిన తర్వాత తన కుమారుడిని రక్షించుకునేందుకు అప్పలరాజు తెరవెనుక చక్రం తిప్పారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బైక్ రిజిస్ట్రేషన్ ఆధారంగా ఆరవ్ స్నేహితుడు సిద్ధార్థ్‌ను పోలీసులు నిందితుడిగా చూపిస్తూ తొలుత స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.
ఈ వ్యవహారంపై స్థానికులు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ పోలీసుల తీరును ఎండగట్టారు. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు పెట్రోల్ బంక్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రమాద సమయంలో బైక్ నడిపింది ఆరవ్ అని నిర్ధారించారు. తీవ్ర ఒత్తిడి నడుమ ఆరవ్తో పాటు అతని స్నేహితుడు సిద్ధార్థ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, తప్పుదోవ పట్టించేలా నిందితులను తారుమారు చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన సీదిరి అప్పలరాజును పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.








