Congress: సరిహద్దుల్లో చైనా దురాక్రమణ.. కేంద్రం వాస్తవాలు దాచిపెడుతోందన్న కాంగ్రెస్..!
2020 గల్వాన్ లోయ ప్రతిష్టంభన సమయంలో వాస్తవాలను కేంద్రం తొక్కిపెడుతోందా…? చైనా చొరబాట్లను ప్రస్తావించకుండా దాచేస్తోందా..? లోక్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వ్యాఖ్యలను చూస్తే అదే అనిపిస్తుంది కూడా. తనను మాట్లాడనివ్వకుండా కేంద్రం కావాలనే అడ్డుకుంటోందన్నారు రాహుల్. అయితే అసలు ప్రచురితం కాని పుస్తకంలో వ్యాఖ్యలను.. సభలో ప్రస్తావించడమేంటని బీజేపీ ఎదురుదాడి చేసింది.
భారత్-చైనా మధ్య 2020లో జరిగిన ఘర్షణ అంశం సోమవారం లోక్‌సభను స్తంభింపజేసింది. చైనా దురాక్రమణపై భారత సైన్యం మాజీ అధిపతి ఎం.ఎం.నరవణె రాసిన ఆత్మకథలోని అంశాలను విపక్షనేత రాహుల్‌గాంధీ ప్రస్తావించడంపై అధికారపక్షం భగ్గుమంది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో బీజేపీఎంపీలు ఆక్షేపణ తెలిపారు. సభను రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. రాహుల్ మాట్లాడేందుకు స్పీకర్ ఓంబిర్లా అనుమతించలేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సమయంలో వాగ్వాదం, గందరగోళం తలెత్తింది. ఈ తీర్మానంపై మాట్లాడేముందు బీజేపీ సభ్యుడు తేజస్వీ సూర్య.. కాంగ్రెస్ పార్టీ జాతీయవాదంపై చేసిన అభియోగాలపై స్పందిస్తానని రాహుల్ చెప్పారు. 2020లో లద్దాఖ్ ఘర్షణలపై నరవణె రాసిన పుస్తకానికి సంబంధించి ఒక మ్యాగజీన్ ప్రచురించిన కథనాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని ఆరోపించారు. ఇవి తాను చెప్పే మాటలు కాదని, స్వయంగా నరవణె ఓ పుస్తకంలో రాశారని రాహుల్ చెప్పారు. ఈ పుస్తకం ప్రచురణను కేంద్రం అడ్డుకుంటోందన్నారు.
రాహుల్ చెబుతున్న పుస్తకమే ఇంకా ప్రచురితం కాలేదని, దానిపై ఎలా మాట్లాడతారని రాజ్‌నాథ్‌తో పాటు కేంద్రమంత్రి అమిత్ షా అభ్యంతరం వ్యక్తంచేశారు. పుస్తకం ప్రచురితమైందో లేదో ముందుగా స్పష్టతనివ్వాలన్నారు. సభా కార్యకలాపాలతో సంబంధంలేని అంశాలపై పుస్తకాలను, పత్రికా వార్తలను ప్రస్తావించడానికి వీల్లేదని స్పీకర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. తాను లేవనెత్తుతున్నది ప్రామాణిక విషయమేనని రాహుల్ సమర్థించుకున్నారు. దానికి స్పీకర్ అనుమతించలేదు.
కేంద్రం భయపడుతోందన్న రాహుల్..
దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని సభలో లేవనెత్తేందుకు ప్రభుత్వం అనుమతించడం లేదని రాహుల్ ఆరోపించారు. నరవణె పుస్తకం ప్రచురితమైతే.. మన సైన్యాన్ని ప్రభుత్వ నేతలు ఎలా నిరాశపరిచారనే విషయాలను ప్రజలు తెలుసుకుంటారని చెప్పారు. డోక్లాం అంశంలో మోడీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో నరవణె ఏం మాట్లాడారో రెండుమూడు వాక్యాలు చెప్పేందుకు యత్నించానని, అంతా బట్టబయలు అవుతుందనే భయంతోనే తనను మాట్లాడనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు.






