Vande Bharat Express: వందేభారత్ భోజనంలో పురుగులు.. ఏకంగా రూ.50 లక్షల ఫైన్!
భారత రైల్వే వ్యవస్థలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్‘ (Vande Bharat Express) రైళ్లలో ప్రయాణికులకు అందించే ఆహారం నాణ్యతపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఓ ప్రయాణికుడికి వడ్డించిన భోజనంలో పురుగులు దర్శనమివ్వడం సామాజిక మాధ్యమాల్లో పెను దుమారమే రేపింది. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన రైల్వే శాఖ.. బాధ్యులపై కనీవినీ ఎరుగని రీతిలో కొరడా ఝుళిపించింది.
అసలేం జరిగిందంటే..
మార్చి 15వ తేదీన రితేష్ కుమార్ అనే ప్రయాణికుడు పట్నా నుంచి టాటానగర్ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో (Vande Bharat Express) ప్రయాణించాడు. ప్రయాణ సమయంలో రైల్వే సిబ్బంది అతనికి భోజనం అందించారు. అయితే అందులో ఇచ్చిన పెరుగులో పురుగులు ఉండటాన్ని గమనించిన రితేష్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన ఆయన.. రైలులోని క్యాటరింగ్ మేనేజర్‌ను పిలిచి నిలదీశాడు. అక్కడి సిబ్బంది ఆ భోజనాన్ని పరిశీలిస్తున్న తతంగాన్నంతా రితేష్ తన మొబైల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ చేశాడు. ప్రీమియం రైలులో ఇలాంటి నాసిరకం, కలుషిత ఆహారం అందించడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రైల్వే శాఖ కఠిన చర్యలు
ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో రైల్వే మంత్రిత్వ శాఖ ఎక్స్ (X) వేదికగా తక్షణమే స్పందించింది. ప్రయాణికుల ఆరోగ్యం, భద్రత, రైల్వే సేవల్లో నాణ్యతే తమ ప్రథమ ప్రాధాన్యమని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ ఘోర తప్పిదానికి ప్రాథమిక బాధ్యతగా ఐఆర్సీటీసీ (IRCTC)కి ఏకంగా రూ.10 లక్షల భారీ జరిమానా విధించింది. అంతేకాకుండా, ఆ రైలులో (Vande Bharat Express) ఆహారాన్ని సరఫరా చేసిన సంబంధిత ఫుడ్ సర్వీస్ ప్రొవైడర్ (Food service provider) నిర్లక్ష్యంపై ఉక్కుపాదం మోపింది. సదరు ఏజెన్సీకి ఏకంగా రూ.50 లక్షల ఫైన్ వేయడంతో పాటు, వారి క్యాటరింగ్ కాంట్రాక్టును తక్షణమే రద్దు (Contract Terminated) చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.
ఇవి కూడా చదవండి








