మూడు అంశాలను దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇతరులు నేర్చుకోవాలి : అమిత్ షా
తమిళనాడులోని మహాబలిపురంలో 31 వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించగా, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ డిప్యూటీ సీఎం విక్రమార్క, కర్నాటక సీఎం డీకే శివకుమార్, తమిళనాడు సీఎం విజయ్ తో పాటు కేరళ సీఎం, పలు రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. దక్షిణ రాష్ట్రాల అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రశంసించారు. అధిక అక్షరాస్యత, శిక్షణ పొందిన మానవ వనరులు మరియు లోతైన సముద్రాల వినియోగంలో సాంకేతిక నైపుణ్యం” ఈ రాష్ట్రాల పురోగతికి మూడు మూలస్తంభాలుగా ఉన్నాయని అన్నారు. దక్షిణ భారత ప్రజలు మరియు అక్కడి ప్రభుత్వాలు ఆవిష్కరణలు, ఆదాయ వనరుల పెంపుదల వంటి రంగాలలో అనేక అద్భుతమైన సంప్రదాయాలను నెలకొల్పాయని ప్రశంసించారు కూడా. ఈ రెండు అంశాలలో భారతదేశం మొత్తం దక్షిణ భారతదేశం నుండి నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలు, కేటాయింపులు, ఇతర అంశాలపై చర్చించారు. ప్రధానంగా నీట్ వివాదం, కావేరి జలాలు, నియోజకవర్గాల పునర్విభజనపై తమ అభ్యంతరాలను దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదనలు చేశారు. కేంద్రం–రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతోనే సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమని స్పష్టం చేశారు.
దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31 శాతమని చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది కీలక ఆర్థికశక్తిగా ఎదగాలని చెప్పారు. ఏపీకి సంబంధించిన విభజన సమస్యలను వేగంగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి, విశాఖ–విజయవాడ మెట్రో, దుగరాజుపట్నం పోర్టు, రిఫైనరీ, కడప జేఎస్‌డబ్ల్యూ రైల్వే లింక్‌కు కేంద్ర సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఇక.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా పలు అంశాలను లేవనెత్తారు. ‘బలమైన రాష్ట్రాలే.. మరింత బలమైన భారతదేశానికి పునాది’ అని తమిళనాడు సీఎం విజయ్ అభివర్ణించారు. సహకార సమాఖ్య విధానమే దేశ బలానికి పునాది అని వ్యాఖ్యానించారు. కేంద్రం – రాష్ట్రాలు, రాష్ట్రాల మధ్య విభేదాలను చర్చలు, పరస్పర గౌరవం, చట్టబద్ధ విధానాల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్‌పై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాల పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గకూడదని ఆయన స్పష్టం చేశారు.








