ఇండియా కూటమి మీటింగ్ : రాహుల్ ను టార్గెట్ చేసిన వామపక్షాలు
కాంగ్రెస్, సీపీఎం మధ్య రోజు రోజుకీ గ్యాప్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కేరళలో వామపక్షాలు ఓడిపోయిన తర్వాత ఈ గ్యాప్ మరింత పెరిగిపోయింది. న్యూఢిల్లీలో జరిగిన ఇండీ కూటమి సమావేశంలో ఈ వాతావరణం స్పష్టంగా కనిపించింది. కేరళ ఎన్నికల సమయంలో సీపీఎం విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఇండీ కూటమి సమావేశంలో సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సందర్భాన్ని లేవనెత్తిన సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, రాహుల్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకులు వేధింపులకు గురైన విషయాన్ని బ్రిట్టాస్ గుర్తుచేస్తూ, ఆ సమయంలో కాంగ్రెస్‌కు పూర్తిగా మద్దతునిచ్చింది వామపక్షాలేనని పేర్కొన్నారు. అలాగే, తమిళనాడులో డీఎంకేతో పొత్తును తెంచుకోవాలన్న నిర్ణయం తొందరపాటుతో కూడుకున్నదని ఆయన అభివర్ణించారు. సీపీఐ నేత డి. రాజా కూడా బ్రిట్టాస్‌కు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా రాహుల్ పై ఎదురు దాడికి దిగారు. దీంతో కాంగ్రెస్ ఆత్మ రక్షణలో పడిపోయింది.
వామపక్షాలు ఇకపై నిజమైన వామపక్షాలుగా లేవని రాహుల్ వ్యాఖ్యానించారు; కేరళలోని ఎల్డిఎఫ్ (LDF) ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు అక్కడ వ్యాపారం చేయడానికి అనుమతినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. రాహుల్ విజింజం ఓడరేవు ప్రాజెక్ట్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ (UDF) ప్రభుత్వమే ఆ ఒప్పందాన్ని కుదుర్చుకుందని బ్రిటాస్ వెంటనే బదులిచ్చారు.








