మండిపోతున్న ఎండలు.. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ ద్రవ పదార్థాలు మస్ట్!
Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు సెగలు గక్కుతున్నాడు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల మేర పెరిగి 41 డిగ్రీలకు చేరుకోవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ భానుడి భగభగల నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే కేవలం నీళ్లు తాగడమే కాదు, సరైన ఆహార నియమాలు , జీవనశైలి మార్పులు తప్పనిసరి అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీహైడ్రేషన్ , వడదెబ్బ బారిన పడకుండా ఉండటానికి డాక్టర్లు సూచిస్తున్న ఆ కీలక జాగ్రత్తలు ఇవే..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
వాకింగ్‌కు వెళ్లేవారు ఉదయం 8 గంటల లోపే పూర్తి చేయడం మంచిది. ఎండ పెరిగే వరకు బయట ఉండటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల మధ్య అత్యంత ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో బయటకు వెళ్తే గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ తప్పనిసరిగా వాడాలి. ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్ వెంట ఉంచుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్స్ కంటే గాజు లేదా స్టీల్, రాగి బాటిల్స్ వాడటం ఉత్తమం.
ఆహార నియమాలు – ఏవి తినాలి? ఏవి వద్దు?
శరీరంలో నీటి శాతం తగ్గకుండా పుచ్చకాయ, ఖర్బూజా, బొప్పాయి వంటి పండ్లతో పాటు కీర దోసకాయ, ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకోవాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS), నిమ్మరసం వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన సోడియం, పొటాషియం అందుతాయి. రోజుకు కనీసం 6-7 బాటిళ్ల నీళ్లు తాగడం చాలా అవసరం.
అపరిశుభ్రమైన పదార్థాలకు..
నూనెలో వేయించిన పదార్థాలు (ఫ్రైస్), మసాలా ఎక్కువ ఉన్న ఆహారం, రోడ్డు పక్కన అమ్మే అపరిశుభ్రమైన కట్ చేసిన పండ్లు , పానీయాలకు దూరంగా ఉండాలి. వీటివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
వైద్యుల హెచ్చరిక..
నీరు సరిగ్గా తాగకపోతే డీహైడ్రేషన్‌తో పాటు వడదెబ్బ తగిలే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎండ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.








