ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరంజిత్ సింగ్ సంధూ..అభినందించిన ట్రంప్
Delhi LG: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (LG)గా బాధ్యతలు చేపట్టిన అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త తరంజిత్ సింగ్ సంధూను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. గతంలో అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన సమయంలో భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో సంధూ పోషించిన పాత్రను ట్రంప్ ఈ సందర్భంగా కొనియాడారు.
సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ప్రశంసలు..
సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ స్పందిస్తూ.. “ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తరంజిత్ సంధూకు అభినందనలు.. ఒక అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా, అమెరికాలో భారత మాజీ రాయబారిగా ఆయన ఎల్లప్పుడూ ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేయడంలో లోతైన నిబద్ధతను చాటుకున్నారు. ఢిల్లీ పురోగతిలో , ప్రపంచ స్థాయి సంబంధాలను పెంపొందించడంలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో కీలక చర్చలు..
మరోవైపు, అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ 250వ వార్షికోత్సవ వేడుకల (Freedom250) ప్రారంభోత్సవం బుధవారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్జీ సంధూ, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలో అమెరికా పెట్టుబడులను పెంచడం , సాంకేతిక సహకారాన్ని విస్తరించడంపై వారు చర్చించారు. భారత్-అమెరికా భాగస్వామ్యం ప్రపంచ పురోగతికి కీలకమని, జాతీయ రాజధాని నివాసితులకు ప్రయోజనం చేకూరేలా మరింత లోతైన సహకారాన్ని ఆశిస్తున్నట్లు సంధూ ట్విట్టర్ (X) వేదికగా తెలిపారు.
నేపథ్యం..
ప్రముఖ సిక్కు నాయకుడు తేజా సింగ్ సముంద్రీ మనవడైన తరంజిత్ సింగ్ సంధూ, మార్చి 11న ఎల్జీగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల భారీ పరిపాలనా మార్పుల్లో భాగంగా ఈ నియామకం జరిగింది. సంధూ గతంలో వి.కె. సక్సేనా స్థానంలో బాధ్యతలు చేపట్టగా, సక్సేనాను లడఖ్ ఎల్జీగా నియమించారు. సంధూ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసిన సంగతి తెలిసిందే.








