వైద్యశాస్త్రంలో సరికొత్త ఘనత!
ఇజ్రాయెల్ పరిశోధకులు వైద్య శాస్త్రంలో సరికొత్త ఘనతను సాధించారు. దశాబ్దాలుగా కొరుకుడుపడని కొయ్యగా మారిన హెచ్ఐవీ రోగానికి వ్యాక్సిన్‌ను తీసుకొచ్చారు. జన్యు సవరణ ద్వారా హెచ్ఐవీ-ఎయిడ్స్ ఎదుర్కొనగలిగే టీకాను సృష్టించామని వారు స్పష్టం చేశారు. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవీ) అనేది శరీరం లోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. ఈ వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటుండటం వలన పరిశోధకులకు దీనికి ఔషధాన్ని తీసుకురావడం కుదరలేదు. అయితే ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ వర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం, వైరస్‌ను ఒకే వ్యాక్సిన్‌తో నియంత్రించగలిగింది. హెచ్ఐవీ వైరస్‌ను అడ్డుకోవగలిగే రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజింపచేసే టైప్-బీ తెల్ల రక్తకణాలను పలు మార్పులకు గురిచేయడం ద్వారా పరిశోధకులు యాంటీబాడీలను తయారు చేయగలిగారు. హెచ్ఐవీ రోగులకు వ్యాక్సిన్‌ను ఒకసారి ఇంజక్షన్ ద్వారా పంపించి, వారి ఆరోగ్య పరిస్థితిని ఎన్నో రెట్లు మెరుగుపరచవచ్చని వారు తెలిపారు.













