Iran: నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నర్గెస్ కు మరో ఏడున్నరేళ్ల జైలు శిక్ష..!
నోబెల్ శాంతి పురస్కార గ్రహీత (Nobel Peace Prize) నర్గెస్ మొహమ్మదికి ఇరాన్ న్యాయస్థానం మరో ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు దేశం విడిచి వెళ్లకుండా రెండేళ్ల పాటు నిషేధం విధించినట్లు ఆమె న్యాయవాది వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నర్గెస్ నిరాహార దీక్ష ప్రారంభించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 2 నుంచి నర్గెస్ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ఆమె మద్దతుదారులు వెల్లడించారు. దీంతో ప్రజలను రెచ్చగొట్టినందుకు ఆరేళ్లు, ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేసినందుకు మరో ఏడాదిన్నర శిక్ష పడినట్లు ఆమె న్యాయవాది మోస్తాఫా నిలీ వెల్లడించారు. అయితే, దీనిపై ఇరాన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.
మహిళా హక్కుల కోసం ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నర్గెస్(NARGIS) మొహమ్మది ఇప్పటికే అనేక సార్లు జైలుకు వెళ్లారు. పలుమార్లు శిక్షను కూడా అనుభవించారు. ఎన్నో కొరడా దెబ్బలను సైతం ఓర్చుకున్నారు. మూడు దశాబ్దాలకుపైగా ఆమె చేస్తోన్న ఈ పోరాటానికి గుర్తింపుగా 2023లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. జైల్లో ఉండగానే ఆమె నోబెల్‌కు ఎంపికయ్యారు.













