Strait of Hormuz: ఇరాన్‌పై యుద్ధంలోకి యూఏఈ? హోర్ముజ్ జలసంధి తెరిపించేందుకే?
పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో అత్యంత సంచలన పరిణామం చోటుచేసుకోనుంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా సాగిస్తున్న దాడుల్లో (Strait of Hormuz) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కూడా నేరుగా పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నట్లు ప్రముఖ పత్రిక ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది. ఒకవేళ ఇదే జరిగితే, ఇరాన్‌తో ప్రత్యక్ష యుద్ధ రంగంలోకి దిగిన మొట్టమొదటి పర్షియన్ గల్ఫ్ దేశంగా యూఏఈ నిలవనుంది.
టార్గెట్ హోర్ముజ్
ఇరాన్ తమ దేశంపై పరోక్షంగా దాడులు చేస్తున్నా ఇన్నాళ్లూ యూఏఈ తీవ్ర సంయమనం పాటించింది. కానీ ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) ఇరాన్ ఏకపక్షంగా మూసివేయడంతో యూఏఈ ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. ఈ నేపథ్యంలోనే యూఏఈ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే హోర్ముజ్‌ను బలవంతంగానైనా తెరిపించాలని ఆ దేశం గట్టి నిశ్చయానికి వచ్చింది. ఈ దిశగా అమెరికా చేస్తున్న సైనిక ప్రయత్నాలకు యూఏఈ దౌత్య వర్గాలు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
అవసరమైతే బలప్రయోగం చేయడానికి వీలుగా, ఇరాన్‌పై సైనిక చర్యలకు అధికారం ఇచ్చే ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి’ (UNSC) తీర్మానం కోసం యూఏఈ రహస్యంగా అమెరికా, యూరప్, ఆసియా దేశాలతో మంతనాలు జరుపుతోందని సమాచారం.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇరానియన్లకు నో ఎంట్రీ
గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఇప్పటికే ఏకంగా 2,500కు పైగా క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడినట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రతీకార దాడుల వల్ల గల్ఫ్ దేశాల ప్రజల్లో ఇరాన్ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఆందోళనల నడుమ యూఏఈ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ పౌరులు (Iranians) ఎవరూ తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. విమానయాన సంస్థలకు సైతం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కేవలం ‘గోల్డెన్ వీసా’ (Golden Visa) కలిగిన వారికి మాత్రమే ఈ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది. మరోవైపు, హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తెరవడానికి గానీ, తమ క్షిపణి వ్యవస్థలను దెబ్బతీయడానికి గానీ ఏ దేశం ప్రయత్నించినా పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరిస్తుండటంతో గల్ఫ్ ప్రాంతంలో భయంకరమైన యుద్ధ వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి








