సరదాగా మరిన్ని దాడులు చేస్తాం.. ఇరాన్‌ను ఉద్దేశించి ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి ఖర్గ్ ఐలాండ్‌పై సరదాగా మరిన్ని దాడులు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇప్పటికే అమెరికా దళాలు జరిపిన దాడుల వల్ల ఖర్గ్ ద్వీపంలోని సైనిక స్థావరాలు భారీగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. అయినప్పటికీ, తమ వినోదం కోసం మరికొన్ని సార్లు ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ప్రస్తుతం ఇరాన్ అమెరికా మిత్రదేశాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం మూడో వారానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఖర్గ్ ద్వీపంపై జరిగిన దాడుల వివరాలను ట్రంప్ వెల్లడించారు. తమ దళాలు అక్కడ ఉన్న సైనిక మౌలిక సదుపాయాలను ఇప్పటికే క్షిపణులతో ధ్వంసం చేశాయని ఆయన తెలిపారు. అయితే, ఇప్పటి వరకు అక్కడి చమురు క్షేత్రాలను మాత్రం తాము టచ్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఖర్గ్ ఐలాండ్ అనేది ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన కేంద్రం కావడం గమనార్హం. ఒకవేళ ఆ చమురు క్షేత్రాలపై దాడి జరిగితే ఇరాన్ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింటుంది.
యుద్ధం ముగింపు కాల్పుల విరమణ గురించి కూడా ట్రంప్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఇరాన్ ఒక ఒప్పందం కోసం చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే వారు ప్రతిపాదించిన షరతులు ఏమాత్రం సరిపోవని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ విధించిన నిబంధనలు బలహీనంగా ఉన్నాయని, అందుకే తాను ఇప్పుడు యుద్ధం ముగించేందుకు సిద్ధంగా లేనని ట్రంప్ తెగేసి చెప్పారు. కాల్పుల విరమణకు సంబంధించిన నిబంధనలు అత్యంత కఠినంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అయితే ఆ బలమైన నిబంధనలు ఏమిటనే విషయాన్ని వెల్లడించడానికి మాత్రం ఆయన నిరాకరించారు.
ఇదే సమయంలో ఇరాన్ అగ్రనేత ఖమేనీ కుమారుడు మొజ్తాబా బతికే ఉన్నారా? అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అంతర్గత నాయకత్వంపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు యుద్ధ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ట్రంప్ చేసిన ఈ ‘సరదా దాడుల’ వ్యాఖ్యలపై అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక దేశంపై దాడులను సరదాగా చేస్తామనడం దౌత్యపరమైన నిబంధనలకు విరుద్ధమని వారు అభిప్రాయపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడి ఈ దూకుడు వైఖరి పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు ఆటంకంగా మారుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








