రివ్యూ : సించేసిన చిట్టిబాబు....సంపేసిన సుకుమార్ తెలుగు సినిమా విశ్వరూపం ఈ 'రంగస్థలం'

రివ్యూ : సించేసిన చిట్టిబాబు....సంపేసిన సుకుమార్ తెలుగు సినిమా విశ్వరూపం ఈ 'రంగస్థలం'

30-03-2018

రివ్యూ : సించేసిన చిట్టిబాబు....సంపేసిన సుకుమార్ తెలుగు సినిమా విశ్వరూపం ఈ 'రంగస్థలం'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3.25/5

బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్
పంపిణీదారులు: కొణిదల ప్రొడక్షన్ కంపెనీ

నటి నటులు : రామ్ చరణ్, సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అనసూయ భరద్వాజ్, అమిత్ శర్మ, నరేష్, రోహిణి, బ్రహ్మాజీ, గౌతమి, రాజేష్ దివాకర్, మరియు పూజ హెగ్డే స్పెషల్ అప్పీరెన్స్

సినిమాటోగ్రఫీ : రత్నవేలు, ISC; ఎడిటర్ : నవీన్ నూలి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, పాటలు : చంద్ర బోస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, మోహన్ చెరుకూరి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సుకుమార్

విడుదల తేదీ: 2018 మార్చ్, 30 


మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. 16నెలల గాప్ తరువాత  రామ్ చరణ్, 27 నెలలు గాప్  తరువాత సుకుమార్,  వీరిద్దరి  కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'రంగస్థలం'. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఓ రియాల్టీ ఎంటర్టైనర్ రంగస్థలం, మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై నిర్మించిన ఈ చిత్రం బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. 1985 లో  గోదావరి తీర పల్లె ప్రాంతం ఎలావుందో అలానేవుండే భారీ సెట్స్ లలో ఈ చిత్రంలో ఎక్కువ భాగం చిత్రీకరించబడింది. ఇక ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌, సాంగ్స్‌తో ‘రంగస్థలం’.. విడుదలకు ముందే నిర్మాతలకు బ్రహ్మాస్త్రంగా మారింది. మరింత క్రెజ్ సంపాదించుకున్న ఈ చిత్రం లో సమంత హీరోయిన్ కావడం మరింత హైలెట్ గా చెప్పొచ్చు. మరి సమీక్షలోకి వెడదామా? 

కథ:

రంగస్థలం అనేది గోదావరి పరిసర ప్రాంతాల్లో వుండే ఓ గ్రామం పేరు. 1980 ల నాటి ప్రాంతం లో  ఒక సరళమైన, సుపరిచిత కథ.  ఆ  గ్రామ యువకుడు చిట్టిబాబు (రామ్ చరణ్) అతనికి  పాక్షికంగా చెవుడు ఉన్నప్పటికీ, సరదాగా తన  జీవన  విధాన్నాన్ని మలుచుకుంటాడు. దుబాయ్ నుండి  తిరిగి వచ్చిన అన్నయ్య కుమార్ బాబు (ఆది పినిశెట్టి)  చిట్టిబాబు కు తోడుగా ఉంటాడు. 30 సంవత్సరాలనుండి ఏకకాలంగా అధ్యక్షుడుగా  రంగస్థలం గ్రామాన్ని ఏలుతుంటాడు ఫణింద్ర భూపతి (జగపతి బాబు) అతను చేసే దురాగతాలకు హద్దు అదుపు ఉండదు ఇదేంటని ప్రశినిస్తే చంపేస్తాడు. ఆ వూరిలో జరిగే కొన్ని సంఘటనల శ్రేణిల తరువాత కుమార్ బాబు ని అధ్యక్షుడి పదవికి రాబోయే ఎన్నికలలో అతనిపై నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ తరుణం లో తనకు ప్రత్యర్థిగా ఉన్న కుమార్ బాబుని అంతమొందిస్తాడు ఫణింద్ర భూపతి.  ఆ తర్వాత ఆది తమ్ముడు చిట్టిబాబు ఎలాంటి సాహసానికి పూనుకున్నాడు.. రామలక్ష్మి (సమంత) కథలో ఏవిధంగా కీలకం అయ్యింది? రంగమ్మత్త (అనసూయ) పాత్ర ఏంటి? దక్షిణా మూర్తి (ప్రకాష్ రాజ్) పాత్ర ఎలా ఉండబోతుంది? లాంటి అనేక ఆసక్తికర మరిణామాలతో అత్యంత రసవత్తరంగా ఉంటుంది మిగతా కథ.

ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్:

ఆమాయకత్వం, ధైర్యం, ప్రేమ, పగ కలగలిసిన అద్భుతమైన పాత్రలో రాంచరణ్ జీవించాడు. ఒక  చెవిటి పాత్రలో పెద్ద ప్రయోగమే చేసాడని చెప్పొచ్చు. చిత్రం మొత్తం వన్ అండ్ ఓన్లీ గా ప్రేక్షకులను, అభిమానులను అలరించాడు. తెరపై తనలోని నటుడ్ని పూర్తిస్థాయిలో ఆవిష్కరించాడు. కీలక సన్నివేశాల్లో ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో పాటు కొన్ని పాటల్లో ఆయన వేసిన మాస్ స్టెప్స్ కూడ బాగా  అలరించాయి.  ఇక పల్లెటూరి అమ్మాయి రామలక్ష్మిగా సమంత నటన ఎంతో ముచ్చటగా వుంది.  ఆమెకు, చరణ్ కు మధ్యన నడిచే ప్రతి సన్నివేశం అందంగా, ఎంటెర్టైనింగ్ గా సహజంగా వుంది. చిట్టిబాబు అన్నయ్య కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో ఓ కీలక పాత్ర కావడంతో మంచి మార్కులు కొట్టేసాడు. ఇక టివి యాంకర్ అనసూయ రంగమత్తగా తన పాత్ర మేర నటించింది. ప్రతినాయకుడి పాత్రలో జగపతి బాబు తనదైన స్టయిల్లో నటించాడు. మిగతా పాత్రలలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ, ఎప్పటిలాగే కథలో సరిపోయారు.ఇక డీజే బ్యూటీ పూజా హెగ్డే ‘జిగేల్ రాణీ’ అంటూ ఐటమ్ సాంగ్ అందాలను ఊరిస్తుండంటం యువ ప్రేక్షకుల్ని థియేటర్స్‌కి రప్పించేలా చేస్తున్నాయి. 

సాంకేతిక వర్గం పని తీరు:

సుకుమార్ తో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడు సినీ ప్రముఖులు చాలా మంది పెదవి విరుచుకున్నారు. 1985 నాటి  రంగస్థలమట, ఎవరు చూస్తారు ఈ పిరియాడికల్ మూవీ అని విమర్శించిన వారు వున్నారు. అలాంటి వారికి "రంగస్థలం" విజయం తో  ధీటైన సమాధానం ఇచ్చాడు సుకుమార్.  పల్లెటూరి రాజకీయ నేపథ్యంలో బలమైన కథతో, వాస్తవికతకు చాలా దగ్గరగా ఉండే విధంగా పాత్రలు, సినిమాతో పాటు ప్రేక్షకుడు మమేకమయ్యేలా  స్క్రీన్ ప్లే  రెడీ చేసుకున్నాడు సుకుమార్.  గ్రామీణ నైపథ్యంతో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర లను ఆసక్తికరంగా మలుచుకుంటూ, ఆ పాత్రల పోషించిన నటీనటులను బాగా కష్టపెట్టి సినిమా అద్భుతంగా రావడానికి తనవంతు కృషి చేసాడు సుకుమార్.  ముఖ్యంగా సెకండాఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్  దేవిశ్రీ  ప్రసాద్ కాంబినేషన్ అంటేనే ఆడియో మంచి హిట్, ఈ సారి కూడా వీరి కాంబినేషన్ సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు  తన సంగీతంతో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ, మౌనికల ప్రొడక్షన్ డిజైన్ ప్రేక్షకుడ్ని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి. వాళ్ళు రూపొందించిన రంగస్థలం విలేజ్ సెట్ వర్క్ రెండున్నర గంటలపాటు ప్రేక్షకుల్ని నిజంగా ‘రంగస్థలం’ అనే గ్రామ వాతావరణంలోకి తీసుకెళ్లింది. ఇక మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్వుస్ కు పేరు పెట్టేదెవరు? సినిమా ని ఉన్నత స్థాయికి తీసికెళ్ళాయి.

విశ్లేషణ :

'రంగస్థలం' అనే గ్రామం లో 1985నాటి కథ తో అప్పటి పల్లెటూరి వాతావరణం ఈ జెనరేషన్ వారి కళ్ళకు కట్టినట్టుగా చూపించగలిగాడు దర్శకుడు సుకుమార్. రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ ‘రంగస్థలం’ ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడ రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను చాలా భిన్నంగా రూపొందించారు. కానీ ఈ సినిమాలో చాలా అంశాలు, పాత్రలు పాతవైనా  కొత్తగా ఉండి ఆకట్టుకున్నాయి. మంచి కథ కథనాలు, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే చిట్టిబాబు, రంగమ్మత్త, కుమార్ బాబుల పాత్రలు, రఫ్ఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు కాగా కొద్దిగా ఎక్కువైన రన్ టైం మూడు ఘంటలు కావడంతో  సెకండ్ హాఫ్  ఆరంభం లో  కొద్దిగా సాగదీసినట్టు ఉండటం కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద ఈ వేసవిలో అటు మాస్ ప్రేక్షకుల్ని, కుటుంబ ప్రేక్షకుల్ని ఈ చిత్రం తప్పక ఆకట్టుకుంటుంది.