పాక్‌తో చర్చలంటూ జరిగితే.. పీవోకేపైనే

పాక్‌తో చర్చలంటూ జరిగితే.. పీవోకేపైనే

19-08-2019

పాక్‌తో చర్చలంటూ జరిగితే.. పీవోకేపైనే

ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడం మానుకునే వరకూ పాకిస్థాన్‌తో చర్చలకు అవకాశం లేదని, ఒకవేళ చర్చలు జరపాల్సి వస్తే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)పైనే ఉంటుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సృష్టం చేశారు. హరియాణాలో నవంబరులో జరిగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజ్‌నాథ్‌ ఓ బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం, జమ్మూకశ్మీర్‌ను విడగొట్టడంతో పాక్‌ దిక్కుతోచని స్థితిలో పడిందని, ప్రపంచ దేశాల సాయం కోరుతోందని అన్నారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అమెరికా వెళ్తే ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చీవాట్లు పెట్టి పంపించారని ఎద్దేవా చేశారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్‌లో అస్థిర వాతావరణాన్ని సృష్టించాలని పాక్‌ పన్నాగం పన్నుతోందని, ఎలాంటి జవాబివ్వాలో ప్రధాని మోదీకి బాగా తెలుసని వ్యాఖ్యానించారు. బాలకోట్‌ కంటే భారీ దాడులకు భారత్‌ సన్నాహాలు చేస్తోందని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ అన్నారని, దీన్ని బట్టి బాలాకోట్‌ దాడులను ఆయన గుర్తించినట్టేనని అన్నారు. ఆర్టికల్‌ 370ను ఎవరూ ముట్టకోలేరని, బీజేపీ రద్దు చేస్తే ఎన్నడూ అధికారంలోకి రాదంటూ విపక్షాలు గగ్గోలు పెట్టాయని, మోదీ సర్కారు మాత్రం దీన్ని నిమిషాల్లోనే రద్దు చేసిందని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో చేసిన ఒక వాగ్దానాన్ని తాము నెరవేర్చామన్నారు.