TAL: లండన్‌లో ఘనంగా టీఏఎల్ 21వ వార్షికోత్సవం, ఉగాది 2026 వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) తన 21వ వార్షికోత్సవం ఉగాది వేడుకలను 21 మార్చ్ 2026న పశ్చిమ లండన్‌లోని నార్త్ హాల్ట్ (SKLPC) లో అత్యంత వైభవంగా నిర్వహించింది. యూకే నలుమూలల నుంచి వందలాది తెలుగు కుటుంబాలు పాల్గొన్న ఈ వేడుకలు కన్వీనర్ వాసుదేవ రెడ్డి మేరెడ్డి ఆధ్వర్యంలో, ఛైర్మన్ రవి సబ్బా ట్రస్ట్ బోర్డు సభ్యుల నాయకత్వంలో దిగ్విజయంగా జరిగాయి. రెండు దశాబ్దాలుగా యూకేలో తెలుగు భాష, సంస్కృతి సమాజ సేవను ప్రోత్సహిస్తున్న TAL ప్రయాణాన్ని ఈ వేడుక ప్రతిబింబించింది.
ప్రధానాకర్షణగా సంగీత సభ, సాంస్కృతిక ప్రదర్శనలు:
కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా ప్రసిద్ధ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ నిర్వహించిన ప్రత్యేక సంగీత సభ నిలిచింది. తెలుగు సంగీత సాహిత్యాలకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా “కల్చరల్ ఎక్సెలెన్స్ పురస్కారం” ప్రదానం చేశారు. జానపద కళాకారులు రెలరే గంగా, నల్గొండ గద్దర్ (కాసాల నర్సన్న) తమ ప్రదర్శనలతో తెలంగాణ జానపద తరంగాలను రంగస్థలంపై ఆవిష్కరించారు. ప్లేబ్యాక్ గాయకులు అఖిల్ చంద్ర, శ్రీనికా మహతి సాంప్రదాయ ఆధునిక గీతాలతో ప్రేక్షకులను అలరించగా, యాంకర్ రవి బృందం కార్యక్రమాన్ని ఆకర్షణీయంగా నడిపించారు. TAL కల్చరల్ సెంటర్ల (TCC) విద్యార్థుల ప్రదర్శనలు కొత్త తరం తెలుగు కళలను ఎంత చక్కగా పునికిపుచ్చుకుంటుందో చాటిచెప్పాయి.
ఇవి కూడా చదవండి
పురస్కారాలు, ప్రముఖుల ప్రశంసలు:
ఈ వేడుకలో భాగంగా ప్రతిష్టాత్మకమైన “లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు” (LTA) ను లార్డ్ నాగరాజు (ఉదయ్ నాగరాజు) గారికి అందజేశారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఆయన నియామకంతో పాటు, నాయకత్వం కృత్రిమ మేధస్సు రంగాల్లో ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తించారు. మాజీ ఛైర్పర్సన్లు ప్రస్తుత బోర్డు సభ్యులు ఈ సత్కారంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీమా మాల్హోత్రా (MP), తెలుగు సంస్కృతి పరిరక్షణలో TAL పోషిస్తున్న పాత్రను ప్రత్యేకంగా ప్రశంసించారు.
వార్షిక పత్రిక ఆవిష్కరణ, టీపీఎల్ ప్రకటన:
TAL వార్షిక పత్రిక “మా తెలుగు 2026” ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ పత్రిక సంపాదకుడు వంశీ మోహన్ సింగళూరిని నిర్వాహకులు సన్మానించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు త్వరలో ప్రారంభం కానున్న “T20 TAL ప్రీమియర్ లీగ్” (TPL) క్రికెట్ సీజన్‌ను కూడా ప్రకటించారు. ఛైర్మన్ రవి సబ్బా మాట్లాడుతూ ఉగాది భవిష్యత్ తరాలకు మన సంస్కృతిని అందించే బాధ్యతను గుర్తు చేస్తుందని పేర్కొన్నారు.
వాలంటీర్లు, దాతలకు ధన్యవాదాలు:
కన్వీనర్ వాసు మేరెడ్డి ఈ వేడుక విజయవంతం కావడానికి అంకితభావంతో పనిచేసిన రవీందర్ రెడ్డి గుమ్మకొండ, రవి వాస, లక్ష్మణ్ కోట, రాయ్ బొప్పన, శ్రీహరి అరిగె, పవన్ తిరునగరి, సునీత అరిగె, మాధవి తొటకూరు, ఉమ అనంతుల, బిందు పుట్లూరు, మురళి కోట వంటి వాలంటీర్లకు స్పాన్సర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 21 ఏళ్లుగా TAL యూకేలోని తెలుగు సమాజానికి “స్వదేశం లాంటి ఆదరణ” అందిస్తూ ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








