అనసూయ మాటలపై రచ్చ.. పోలీసుల దృష్టికి వెళ్లిన వివాదం
అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హిందూ మతానికి సంబంధించి ఆమె చేసిన కామెంట్స్ తమ మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్లో స్థానిక బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనసూయ కామెంట్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ విషయంలో ఇకపై జాగ్రత్తగా ఉండాలని కూడా ఆమెను హెచ్చరించారు.
ఇటీవల ఓ సందర్భంలో కొందరు వ్యక్తులు ఇతరులపై దాడులకు పాల్పడుతూ జై శ్రీరామ్ నినాదాన్ని ఉపయోగిస్తున్నారంటూ అనసూయ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారితీయడంతో పాటు, కొంతమంది నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అయితే తన మాటలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అనసూయ ఇప్పటికే స్పష్టం చేశారు. తాను ఏ మతాన్ని, వర్గాన్ని లేదా విశ్వాసాన్ని కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని, ఒక నిర్దిష్ట వర్గంలోని వ్యక్తుల ప్రవర్తనను మాత్రమే ప్రస్తావించానని వివరణ ఇచ్చారు.
అనసూయ గతంలోనూ సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ పలు సందర్భాల్లో వివాదాలకు కేంద్రంగా నిలిచారు. తాజా కంప్లైంట్ తో మరోసారి ఆమె కామెంట్స్ రాజకీయ, మతపరమైన చర్చకు దారితీశాయి. ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదును స్వీకరించి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ దశలో ఫిర్యాదు మినహా అనసూయపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం లేదు. ఈ వ్యవహారంపై ఆమె నుంచి మరింత వివరణ రావాల్సి ఉంది.








