జీ5లో ఉత్కంఠభరితంగా ‘కొన్ యశ్వంత్ పన్సారే?’ వెబ్ సిరీస్.. అక్టోబర్ 16 నుంచి స్ట్రీమింగ్!
న్యాయం, అధికారం, నిజం మధ్య జరిగే సంక్లిష్ట పోరాటాన్ని కళ్లకు కట్టే సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘కొన్ యశ్వంత్ పన్సారే?’ (Kon Yashwant Pansare?) ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రఖ్యాత జీ5 ఓటీటీ వేదికగా అక్టోబర్ 16, 2026 నుంచి ఈ సిరీస్ ప్రీమియర్ కానుంది. ఆనంద్ దిలీప్ గోఖలే రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కన్హాస్ మ్యాజిక్ పతాకంపై మంజిరి సుబోధ్ భావే నిర్మించారు. ప్రశంసలు పొందిన జీ5 తమిళ సిరీస్ ‘సత్తముమ్ నీధియమ్’ ఆధారంగా ఈ మరాఠీ సిరీస్ను రూపొందించారు. భరత్ జాధవ్, శివాని రంగోలే, పుష్కర్ శ్రోత్రి, శర్వరి జామేనిస్, ఉజ్వల జోగ్, విద్యాధర్ జోషి, మిలింద్ పాఠక్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.
కథా నేపథ్యం…
ఒకప్పుడు శక్తివంతమైన న్యాయవాదిగా వెలుగొందిన యశ్వంత్ పన్సారే, తన జీవితంలో జరిగిన ఒక భారీ వైఫల్యం కారణంగా తీవ్ర అపరాధ భావంతో నోటరీగా పనిచేస్తుంటాడు. అల్కా అనే యువతి అదృశ్యమైన ఉదంతంలో పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ సదాశివ్ మాపారి అనే వృద్ధ తండ్రి కోర్టు వెలుపుల నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయడం పన్సారే జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఈ ఘటనతో చలించిపోయిన పన్సారే మళ్లీ కోర్టు మెట్లు ఎక్కుతాడు. నిర్భయంగా వ్యవహరించే యువ వకీలు జాన్వితో కలిసి ఆయన పిల్ (PIL) దాఖలు చేస్తాడు.
ఈ అదృశ్య కేసు క్రమంగా పోలీసు రికార్డులు, మానసిక అనారోగ్యం, దాచిపెట్టిన సాక్ష్యాలు , రాజకీయ ప్రభావాల చుట్టూ తిరిగే సంక్లిష్టమైన హేబియస్ కార్పస్ విచారణగా మారుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సార్థాతో జరిగే న్యాయ పోరాటంలో పన్సారే తన గతాన్ని ఎదుర్కొని, నిజం నిరూపించడానికి ఎలా ప్రయత్నించారనేదే ఈ సిరీస్ ప్రధాన కథాంశం.
నటీనటులు, సాంకేతిక నిపుణులు…
ప్రధాన తారాగణం: భరత్ జాధవ్, పుష్కర్ శ్రోత్రి, శివాని రంగోలే, శర్వరి జామేనిస్, ఉజ్వల జోగ్, విద్యాధర్ జోషి, మిలింద్ పాఠక్
రచన – దర్శకత్వం: ఆనంద్ దిలీప్ గోఖలే
నిర్మాణం: కన్హాస్ మ్యాజిక్ (మంజిరి సుబోధ్ భావే)
విడుదల తేదీ: అక్టోబర్ 16, 2026
వేదిక: జీ5 (ZEE5)
ఈ సిరీస్ కేవలం కోర్టు వాదనలకే పరిమితం కాకుండా, ఇన్వెస్టిగేషన్ కోణంలో సాగుతూ వ్యవస్థలోని లోపాలను, మనిషి అంతర్గత పోరాటాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. అక్టోబర్ 16 నుంచి జీ5లో ఈ ఉత్కంఠభరితమైన సిరీస్ను వీక్షించవచ్చు.







