రామాయణ రిలీజ్కు ముందు సాయి పల్లవి స్పెషల్ ట్రీట్
తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాయి పల్లవి మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈసారి ఆమె రాకకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మైథలాజికల్ మూవీ రామాయణలో సీతగా కనిపించనున్న సాయి పల్లవి.. ఆ సినిమా రిలీజ్ కు ముందు జీ తెలుగు పాపులర్ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్లో గెస్టుగా పాల్గొననుంది. దీంతో ఈ ఎపిసోడ్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
జగపతిబాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షో ఫస్ట్ సీజన్లో అక్కినేని నాగార్జున, శ్రీలీల వంటి ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్స్, కెరీర్లో ఎదురైన అనుభవాలు, బయటకు తెలియని జ్ఞాపకాలను ఆసక్తికర సంభాషణల ద్వారా ఆడియన్స్ కు పరిచయం చేయడం ఈ కార్యక్రమానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తాజాగా రిలీజైన సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో జగపతిబాబు, సాయి పల్లవి మధ్య సరదా సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఓ ఫొటోను చూసిన సాయి పల్లవి ఆశ్చర్యం వ్యక్తం చేయడం ఆసక్తిని పెంచింది. అయితే ఆ ఫొటో ఏమిటనేది ప్రోమోలో చూపించలేదు.
మరోవైపు, రామాయణలో సీత పాత్రలో సాయి పల్లవి ఎలా కనిపించబోతున్నారనే అంశంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టాక్ షోలో ఆమె సినిమా గురించి ఏమైనా విశేషాలు పంచుకుంటారా? తన క్యారెక్టర్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి సెకండ్ సీజన్ అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుండగా, సాయి పల్లవి పాల్గొన్న స్పెషల్ ఎపిసోడ్ అక్టోబర్ 18న ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.







