భక్తిపై కాదు, అర్థరాత్రి శబ్ధ కాలుష్యంపైనే అభ్యంతరం.. అల్లు శిరీష్ క్లారిటీ
టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్(Allu sirish) చేసిన ఓ సోషల్ మీడియా కంప్లైంట్ తాజాగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ షేక్‌పేటలోని తన నివాసం సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయం వద్ద అర్థరాత్రి వరకు డీజే సౌండ్‌తో సాంగ్స్ వినిపిస్తున్నాయని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వరుసగా రాత్రి 2 నుంచి 3 గంటల వరకు సౌండ్ రావడంతో వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని శిరీష్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఫిల్మ్‌నగర్ పోలీసులను గతంలో సంప్రదించినప్పటికీ, గణేష్ నిమజ్జనం కార్యక్రమాల నేపథ్యంలో సెప్టెంబర్ 25 వరకు సహకరించాలని సూచించినట్లు ఆయన తెలిపారు.
అయితే గుడిని ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేయడం సోషల్ మీడియాలో భిన్నమైన రెస్పాన్స్‌లకు దారితీసింది. కొందరు శిరీష్ తీరును ప్రశ్నించగా, మరికొందరు మతంతో సంబంధం లేకుండా అర్థరాత్రి అధిక శబ్దం పౌర సమస్యగానే చూడాలని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించి, సమస్యను ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
దీంతో తన ఉద్దేశాన్ని మరింత స్పష్టంగా చెప్పేందుకు శిరీష్ మరోసారి సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. తాను స్వయంగా హనుమంతుడిని ఆరాధించే వ్యక్తినని, తన అభ్యంతరం భక్తికి కాదని తెలిపారు. తెల్లవారుజామున 2 గంటలకు డీజే పెట్టి మ్యూజిక్‌ను వినిపించడం భక్తి కాదని, ఇది పూర్తిగా సివిక్ సెన్స్‌కు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం మతపరమైన అంశం కంటే రాత్రివేళల్లో శబ్ద కాలుష్యం, స్థానికుల ప్రశాంతతకు సంబంధించిన డిస్కషన్ గా మారింది.








