Ghibli అతి పెద్ద రహస్యం.. ఛేదించేదెవరు?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
Studio Ghibli సినిమా వస్తోందని ప్రకటన వస్తే చాలు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో ఎదురుచూపులు మొదలైపోతాయి. ఎందుకంటే గిబిలీ సినిమా అంటే మరో యానిమేషన్ సినిమా కాదు. My Neighbor Totoro, Spirited Away, Howl’s Moving Castle లాంటి సినిమాలతో పిల్లలకే కాదు.. పెద్దలకూ ఒక ప్రత్యేకమైన ఊహా ప్రపంచాన్ని అందించిన స్టూడియో అది.
ఒక్కో గిబిలీ సినిమా ఒక కథను చెప్పి వెళ్లిపోదు. అందులోని పాత్రలు, ప్రపంచం, సంగీతం, భావోద్వేగాలు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో చాలా కాలం నిలిచిపోతాయి. అందుకే గిబిలీ నుంచి కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
కానీ ఇప్పుడు ఆ ఎదురుచూపుల్లో ఉత్సాహంతో పాటు దిగులు కూడా మొదలైంది.
ఎందుకంటే గిబిలీ నుంచి కొత్త సినిమా వచ్చి చాలా కాలమైంది. మరి తర్వాత సినిమా ఎప్పుడు వస్తుంది? అసలు వస్తుందా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అంతకంటే పెద్ద ప్రశ్న ఒకటి అభిమానులను వెంటాడుతోంది.
Hayao Miyazaki తర్వాత గిబిలీకి ఏమవుతుంది?
నాలుగు దశాబ్దాలుగా ఆ సంస్థకు సృజనాత్మక దిశ చూపించిన Miyazakiకి ఇప్పుడు 85 ఏళ్లు. ఆయన తర్వాత గిబిలీని ఎవరు ముందుకు తీసుకెళ్తారో ఇప్పటివరకు స్పష్టమైన వారసుడి ప్రకటన లేదు. అందుకే ఇప్పుడు అభిమానుల్లో రకరకాల సందేహాలు. స్టూడియో భవిష్యత్తు ఏమిటి? కొత్త తరం దర్శకులు ఆ కళా వారసత్వాన్ని అందుకుంటారా? గిబిలీ తనదైన శైలిని కొనసాగిస్తుందా? లేక Miyazaki తర్వాత ఆ ప్రపంచం క్రమంగా జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుందా?
నాలుగు దశాబ్దాలుగా ఒక ప్రత్యేక ప్రపంచం
1985లో Hayao Miyazaki, Isao Takahata, Toshio Suzuki కలిసి Studio Ghibliని నిర్మించారు. అప్పట్లో అది మరో animation studio మాత్రమే. కానీ My Neighbor Totoro, Kiki’s Delivery Service, Princess Mononoke, Spirited Away, Howl’s Moving Castle వంటి సినిమాలతో గిబిలీ క్రమంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించింది.
పిల్లల కోసం తీసినట్టుగా కనిపించే కథల్లోనే యుద్ధం, ప్రకృతి, కుటుంబం, ఒంటరితనం, మానవత్వం వంటి పెద్ద ప్రశ్నలను దాచడం గిబిలీ ప్రత్యేకతగా మారింది. అందుకే ఈ సినిమాలు పిల్లలను మాత్రమే ఆకట్టుకోలేదు. పెద్దవాళ్లూ వాటితో కనెక్ట్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా గిబిలీ సినిమాలు $2 బిలియన్లకు పైగా టికెట్ వసూళ్లు సాధించాయి. రెండు Academy Awards కూడా గెలుచుకున్నాయి.
అయితే గిబిలీ గొప్పతనం కేవలం బాక్సాఫీస్ నంబర్లలో లేదు. ఒక గిబిలీ సినిమా ఎలా ఉండాలి అన్నదానికి ఆ స్టూడియోనే ఒక ప్రమాణంగా మారిపోయింది. అందుకే ఇప్పుడు Miyazaki తర్వాతి తరం గురించి ఇంత చర్చ జరుగుతోంది.
గిబిలీ ఎందుకు మిగతా స్టూడియోల లాంటిది కాదు?
ఇతర animation studiosలో ఒక సినిమా హిట్ అయితే దాని sequel వస్తుంది. అది హిట్ అయితే మరో sequel. ఆ తర్వాత merchandise, series, theme parks.. ఇలా ఒక successful character చుట్టూ పెద్ద business ecosystem తయారవుతుంది. గిబిలీ మాత్రం ఆ దారిలో పెద్దగా నడవలేదు. Totoro 2 లేదు. Spirited Away 2 లేదు. ప్రతి సినిమాను ఒక కొత్త ప్రపంచంలా నిర్మించింది.
అందుకే గిబిలీకి కొత్త సినిమా తీయడం కూడా ఒక సాధారణ production cycle కాదు. ఒక ఆలోచన దొరికింది కాబట్టి వెంటనే సినిమా మొదలుపెట్టడం కాదు. సరైన కథ, సరైన ప్రపంచం, సరైన కళా రూపం దొరికే వరకు వేచి చూడాల్సిందే.
Goro Miyazaki చెప్పినట్టుగా, ఒక గిబిలీ సినిమా తయారు చేయడం చాలా కష్టమైన, నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ఇదే గిబిలీకి ఉన్న బలం. ఇదే ఇప్పుడు దాని succession problemను కూడా మరింత కష్టంగా మారుస్తోంది.
మరి వారసుడు ఎవరు?
సహజంగానే అందరి చూపూ Goro Miyazaki వైపే వెళ్లింది. Hayao Miyazaki పెద్ద కొడుకు. గిబిలీలో ఇప్పటికే సినిమాలకు దర్శకత్వం వహించారు. స్టూడియో వ్యవస్థ కూడా తెలుసు. కానీ ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. Goro ఆ బాధ్యతను తన మీద వేసుకోవడానికి అంతగా ఆసక్తి చూపలేదు. అంతేకాదు.. Hayao Miyazaki కూడా తన కొడుకే గిబిలీకి వారసుడిగా ఉండాలని పట్టుబట్టలేదు.
2023లో Ghibli సహ వ్యవస్థాపకుడు Toshio Suzuki ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. Goroను వారసుడిగా చూడాలని తాను అనుకున్నానని, కానీ Goro నిరాకరించాడని, Hayao కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు.
ఇక్కడే గిబిలీ సమస్య అసలు రూపంలో కనిపిస్తుంది. గిబిలీకి వారసత్వం రక్తసంబంధంతో రాదు. అది ఒక కళా ప్రమాణం. Miyazaki సృష్టించిన ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన కథ చెప్పే విధానాన్ని కాపీ చేయడం కాదు.. అదే స్థాయి స్వతంత్రమైన కళను సృష్టించగలగాలి. అదే అసలు భారమంతా.
బయట నుంచి CEO వచ్చారు
2023లో Nippon Television Holdings గిబిలీలో 42.3 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆ తర్వాత సంస్థ భవిష్యత్తుకు సంబంధించిన యాజమాన్య నిర్మాణంలో మార్పులు వచ్చాయి. 2026 జూన్ 22 నుంచి Kenichi Yoda Ghibli CEOగా బాధ్యతలు చేపట్టారు. కానీ Yoda వచ్చి గిబిలీని పూర్తిగా కొత్త దారిలోకి తీసుకెళ్తామని చెప్పలేదు. అసలు దానికి విరుద్ధమైన ఆలోచన కనిపిస్తోంది. గిబిలీని మార్చడం కాదు.. గిబిలీగా ఉన్నదాన్ని కాపాడటమే అసలు పని అంటున్నారాయన.
ఎందుకంటే కొత్త CEO ఒక business strategy రూపొందించగలరు. కానీ నాలుగు దశాబ్దాలుగా నిర్మించుకున్న గిబిలీ కళా భాషను, కథ చెప్పే పద్ధతిని, ప్రేక్షకుల నమ్మకాన్ని ఒక్క corporate planతో కొనసాగించలేరు. అందుకే CEO రావడం succession సమస్యకు పూర్తి సమాధానం కాదు.
డబ్బు సమస్య కాదు.. అసలు సమస్య వేరే
గిబిలీ ఆర్థికంగా బలహీనపడిపోయిన సంస్థ కూడా కాదు. 2025 మార్చి 31 నాటికి కంపెనీ వద్ద సుమారు ¥44 బిలియన్ల ఆస్తులు ఉన్నాయి. గత ఏడాది దాదాపు ¥6 బిలియన్ల నికర లాభం వచ్చింది. అంటే కొత్త సినిమా రావడం లేదంటే డబ్బు లేక కాదు. సినిమా తీయడానికి సరైన కారణం, సరైన కథ, సరైన సృజనాత్మక నాయకత్వం కావాలి. అదే గిబిలీని మిగతా animation companies నుంచి వేరు చేస్తుంది.
ప్రపంచం AI వైపు.. గిబిలీ మాత్రం?
ఇంతలో animation ప్రపంచం మరోవైపు వేగంగా మారుతోంది. AI animationను వేగంగా, తక్కువ ఖర్చుతో తయారు చేసే అవకాశాలను తెరుస్తోంది. 2025లో AI-generated “Ghibli-style” images ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడంతో ఈ చర్చ మరింత పెరిగింది. Sam Altman, Mike Tyson వంటి ప్రముఖుల చిత్రాలు కూడా Ghibli-styleలో వైరల్ అయ్యాయి. దాంతో చాలామంది Ghibliని AIకి వ్యతిరేకంగా నిలిచిన కళా ప్రపంచంగా చూశారు. ఈ క్రమంలో Technology వేగంగా మారుతున్నా.. గిబిలీ తన కళా ప్రమాణాన్ని ఎలా కాపాడుకుంటుంది? అదే పెద్ద ప్రశ్న.
సినిమాల కంటే పెద్దదైపోయిన గిబిలీ
ఇప్పటికే Ghibli కేవలం సినిమాలు తీసే సంస్థగా మిగలలేదు. Ghibli Museum ఉంది. Ghibli Park ఉంది. Spirited Away, Princess Mononoke, My Neighbor Totoro వంటి కథలు stage adaptationsగా వచ్చాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో exhibitions జరిగాయి. Merchandise stores కూడా విస్తరించాయి. 2020 నుంచి జపాన్ బయట Netflix ద్వారా, అమెరికాలో HBO Max ద్వారా Ghibli సినిమాలు streamingలోకి వచ్చాయి. అంటే Ghibli ఒక cultural brandగా కూడా మారిపోయింది.
ఫైనల్ గా ..
ప్రపంచం Miyazaki తర్వాతి Ghibli గురించి ఆలోచిస్తుంటే..85 ఏళ్ల Miyazaki మాత్రం ఇంకా తన స్టూడియోకు వస్తూనే ఉన్నారు. ఏం చేస్తున్నారు? కొత్త సినిమా మీద పనిచేస్తున్నారా? ఏదైనా కొత్త animation ఆలోచిస్తున్నారా? లేక మరోసారి తన ప్రపంచంలోకి వెళ్లిపోయారా? ఆయనకు తప్పించి ఎవరికి తెలియదు.
చివరికి.. గిబిలీకి ఏమవుతుంది?
ఒక తరం తన కళను సృష్టించింది. ఇప్పుడు ఆ కళను మరో తరానికి అందించే సమయం వచ్చింది. అది జరిగితే గిబిలీ మరో నలభై ఏళ్లు కొత్త ప్రపంచాలను సృష్టించగలదు. జరగకపోతే.. Totoro, Chihiro, Howl లాంటి పాత్రలు కొత్త సినిమాల్లో కనిపించకపోయినా, అభిమానుల జ్ఞాపకాల్లో మాత్రం ఎప్పటికీ బతికే ఉంటాయి.








