మరో కొత్త ప్రయోగం చేయబోతున్న కిరణ్ అబ్బవరం
కొత్త కథలు, విభిన్నమైన కాన్సెప్ట్‌లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) స్థాపించిన క ప్రొడక్షన్స్(KA Productions) వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను ముందుకు తీసుకొస్తోంది. ఇటీవల తిమ్మరాజు పల్లి టీవీ(Thimmarajupalli TV)తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ బ్యానర్.. ఇప్పుడు మరో వినూత్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈసారి పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్(Pournami Entertainments) తో కలిసి కొత్త సినిమాను నిర్మిస్తోంది.
కిరణ్ అబ్బవరం సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనుష్ గోరక్(Anush Gorakh) దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ అబ్బవరం, వై. శివశంకర్ నాయుడు(Y.shiva shankar naidu) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కుష్లు మద్దాల(Kushlu maddala), రెహ్మాన్(Rahman), నమ్రిత ఎంవీ(Namrita MV), తనూజ పుట్టుస్వామి(Thanuja Puttuswamy) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పటివరకు హీరో, హీరోయిన్ వివరాలను మాత్రం చిత్రబృందం వెల్లడించలేదు.
ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందులో మనుషుల ముఖాలు, ప్రధాన పాత్రల లుక్కు బదులుగా.. పక్షిని పోలిన కాళ్లను మాత్రమే చూపించడం గమనార్హం. దీంతో అసలు ఈ కథ ఏ నేపథ్యంలో సాగుతుంది? ఫాంటసీ, థ్రిల్లర్ లేదా పూర్తిగా కొత్త జానర్లో సినిమా ఉండబోతుందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
అంతేకాదు, ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని కథ, ఊహించని జానర్‌ను పరిచయం చేయబోతున్నామనే సంకేతాన్ని మేకర్స్ ఇచ్చారు. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. టైటిల్, కథాంశం, పాత్రలు, జానర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశముంది. ఇప్పటివరకు వచ్చిన అనౌన్స్మెంట్ ను బట్టి చూస్తే.. క ప్రొడక్షన్స్ నుంచి మరో ప్రయోగాత్మక ప్రయత్నం రాబోతున్నట్లు స్పష్టమవుతోంది.








