అభ్యర్థుల ఎంపిక పవన్‌దే.. స్థానిక ఎన్నికలపై జనసేన నేతలకు కీలక ఆదేశాలు..
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన (Jana Sena Party) పార్టీ కేంద్ర కార్యాలయం కీలక ప్రకటన చేసింది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కొందరు నాయకులు తమకే పార్టీ నుంచి అవకాశం ఖరారైందని, తామే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పార్టీ ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. అలాంటి ప్రచారాలను నాయకులు, కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దని పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరుతో సోమవారం రాత్రి ప్రకటన విడుదలైంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తరఫున అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు వంటి కీలక నిర్ణయాలు పూర్తిగా పవన్ కల్యాణ్ పరిధిలోనే ఉంటాయని పార్టీ తెలిపింది. ఇప్పటివరకు ఎవరికీ అధికారికంగా అవకాశం ఖరారు కాలేదని స్పష్టం చేసింది. ముందుగానే అభ్యర్థులుగా ప్రచారం చేసుకోవడం పార్టీ విధానాలకు విరుద్ధమని పేర్కొంది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించింది.
మరోవైపు కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం పార్టీ (TDP), భారతీయ జనతా పార్టీ (BJP)తో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చలు కొనసాగుతున్నాయని జనసేన వెల్లడించింది. ఈ చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని తెలిపింది. పార్టీ అధినేత సూచించిన నాయకులే ఈ చర్చల్లో పాల్గొంటున్నారని పేర్కొంది. కూటమి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
పార్టీ కోసం చాలాకాలంగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు, త్యాగాలు చేసినవారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా వీర మహిళల నుంచి వచ్చిన అభ్యర్థిత్వాలనూ పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 34 శాతం రిజర్వేషన్లు అమల్లోకి రావడంతో జనసేన వీర మహిళ విభాగం నుంచి కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.
అభ్యర్థుల ఎంపికకు ముందు క్షేత్రస్థాయి అభిప్రాయాలను తెలుసుకునేందుకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ (Mandali Buddha Prasad) నేతృత్వంలో 14 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సోమవారం తొలిసారి సమావేశమై వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, ఆశావహుల వివరాలను పరిశీలించింది. దరఖాస్తులను వడపోసి పార్టీ అధినేతకు నివేదిక అందించనుంది.
స్థానిక ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశాలపై ఎవరూ స్వయంగా ప్రకటనలు చేయకూడదని పార్టీ సూచించింది. పార్టీ సిద్ధాంతాలు, కూటమి విజయాన్ని దృష్టిలో ఉంచుకుని అందరూ క్రమశిక్షణతో పనిచేయాలని కోరింది. ఎన్నికల్లో గెలుపు ఎంత ముఖ్యమో, నాయకులు-కార్యకర్తల మధ్య ఐక్యత కూడా అంతే అవసరమని జనసేన స్పష్టం చేసింది. పార్టీ అధికారిక నిర్ణయం వచ్చే వరకు ఎలాంటి ఊహాగానాలు, వ్యక్తిగత ప్రచారాలకు దూరంగా ఉండాలని సూచించింది.








