వ్యూహం మార్చిన ఎన్టీఆర్.. అనిల్ రావిపూడితో ప్రాజెక్టు వెనుక అసలు కథ ఇదేనా?
ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమా వస్తోందంటే ఫ్యాన్స్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కట్టేవారు. ఆస్వాదించేవారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాల ప్రయాణం మరో దిశలో సాగుతోంది. మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా పాన్ ఇండియా మార్కెట్‌పై దృష్టి పెట్టిన ఆయన, భారీ యాక్షన్ సినిమాలతో తన పరిధిని విస్తరించుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, ‘దేవర’తో మరోసారి తన మాస్ ఇమేజ్ను దేశవ్యాప్తంగా పరిచయం చేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెడుతూ ‘వార్ 2’లో నటించారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చేస్తున్నారు. త్రివిక్రమ్‌తో ‘గాడ్ ఆఫ్ వార్’ టైటిల్ తో ప్రచారంలో ఉన్న భారీ ప్రాజెక్టు కూడా ఆయన లైనప్‌లో ఉంది.
అయితే ఈ ప్రయాణంలో ఒకప్పటి ఎన్టీఆర్‌ను ఇష్టపడే కుటుంబ ప్రేక్షకులకు ఆయన సినిమాలు కొంత దూరమవుతున్నాయా? భారీ యాక్షన్, హై వోల్టేజ్ సన్నివేశాల మధ్య కుటుంబమంతా కలిసి చూసే వినోదానికి చోటు తగ్గుతోందా? ‘వార్ 2’ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో పాటు, వరుసగా భారీ ప్రాజెక్టులే చేస్తున్న నేపథ్యంలో తన సొంత తెలుగు మార్కెట్‌పై కూడా మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఎన్టీఆర్ గుర్తిస్తున్నారా? అనిల్ రావిపూడితో సినిమా ప్రకటన తర్వాత ఈ ప్రశ్నలన్నీ ఆసక్తికరంగా మారాయి.
పాన్ ఇండియా ఇమేజ్ పెరిగింది.. కానీ పాత ఎన్టీఆర్‌ను మిస్ అవుతున్నారా?
ఎన్టీఆర్ కెరీర్‌ను గమనిస్తే ఆయన ఎప్పుడూ ఒకే తరహా పాత్రలకు పరిమితం కాలేదు. మాస్ సినిమాలతో అభిమానులను ఉర్రూతలూగించినా, కుటుంబ కథల్లోనూ అంతే సహజంగా ఒదిగిపోయారు. ‘బృందావనం’లో కనిపించిన ఎన్టీఆర్ వేరు, ‘అదుర్స్’లో చారిగా నవ్వించిన ఎన్టీఆర్ వేరు, ‘నాన్నకు ప్రేమతో’లో చూపించిన నటన మరో స్థాయిలో ఉంటుంది. అంటే ఆయనలో కేవలం యాక్షన్ హీరోనే కాదు.. మంచి ఎంటర్టైనర్ కూడా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
అయితే పాన్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్న తర్వాత సినిమాల స్కేల్ మారింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్, హై వోల్టేజ్ హీరోయిజం ప్రధానంగా మారాయి. ఇలాంటి సినిమాలకు ఒక ప్రత్యేకమైన ప్రేక్షక వర్గం ఉన్నప్పటికీ, అన్ని వయసుల వారిని థియేటర్లకు రప్పించే కుటుంబ వినోదానికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు తమ హీరోలను కేవలం ఫైట్లు, యాక్షన్‌తోనే కాకుండా కామెడీ, ఎమోషన్, కుటుంబ అనుబంధాల ద్వారా కూడా ఇష్టపడతారు. ఆ కోణంలో చూస్తే ఎన్టీఆర్ నుంచి మరోసారి పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తే చూడాలనే ఆసక్తి ఉండటం సహజమే.
ఎన్టీఆర్‌లో ఇంకా బయటకు రావాల్సిన కామెడీ హీరో ఉన్నాడు!
నిజానికి ఎన్టీఆర్లోని కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘అదుర్స్’లో చారి పాత్ర అందుకు చక్కటి ఉదాహరణ. అమాయకత్వం, అమోఘమైన టైమింగ్, డైలాగ్ డెలివరీతో ఆ పాత్రను ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. కామెడీ చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నట్టుగా కాకుండా, సహజంగా నవ్వించగలగడం ఎన్టీఆర్లోని ప్రత్యేకత.
అదే సమయంలో ఆయన ఎమోషనల్ సీన్స్‌లోనూ అద్భుతంగా నటించగలరు. ఒక సన్నివేశంలో ప్రేక్షకులను నవ్వించి, మరో సన్నివేశంలో భావోద్వేగానికి గురిచేయగలగడం ఆయన నటనలోని బలం. డ్యాన్స్ విషయంలోనూ ఎన్టీఆర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కఠినమైన స్టెప్పులను సైతం సులభంగా చేయడం, పాటలో భావాన్ని ఎక్స్ప్రెషన్స్ ద్వారా పలికించడం ఆయనకు అలవాటు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న నటుడిని కేవలం భారీ యాక్షన్ సినిమాలకే పరిమితం చేయాల్సిన అవసరం ఏముంది? సరైన కథ దొరికితే కుటుంబ ప్రేక్షకులకు కూడా మరోసారి బాగా కనెక్ట్ కాగలరు.
అందుకే అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై ఇంత ఆసక్తి!
ఇక్కడే అనిల్ రావిపూడి పేరు ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఆయన సినిమాల్లో కథ ఎంత సీరియస్‌గా ఉన్నా, ప్రేక్షకులను నవ్వించే సందర్భాలకు కొదవ ఉండదు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు థియేటర్లలో రిలాక్స్‌గా సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మంచి వినోదాన్ని గుర్తుపెట్టుకునేలా కథనాన్ని నడిపించడం ఆయన ప్రత్యేకత. ‘ఎఫ్2’, ‘ఎఫ్3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి సినిమాలతో ఈ తరహా ఎంటర్టైన్మెంట్పై తన పట్టును చూపించారు. ‘భగవంత్ కేసరి’తో మాస్ హీరో ఇమేజ్ను, భావోద్వేగాలను కూడా సమర్థంగా ఉపయోగించుకోగలనని నిరూపించారు.
ఒకవైపు ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, మరోవైపు అనిల్ రావిపూడి కామెడీ ట్రీట్మెంట్.. ఈ రెండింటినీ సరిగ్గా కలిపితే థియేటర్లలో మంచి సందడి కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్లోని చారి తరహా వినోదాన్ని మరోసారి బయటకు తీస్తే అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ కొత్త అనుభూతి కలగవచ్చు.
అసలు లెక్క తెలుగు మార్కెట్దేనా?
పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం అంటే ఇతర భాషల్లోనూ మార్కెట్ సంపాదించుకోవడం. కానీ సొంత భాషలో ఉన్న ప్రేక్షకుల అనుబంధాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌కు ఇప్పటికే స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలకు మొదటి రోజు వచ్చే అభిమానులే కాకుండా, కుటుంబ ప్రేక్షకులు కూడా తోడైతే థియేటర్లలో సినిమా ప్రభావం మరోలా ఉంటుంది.
ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు ప్రతి ఒక్కసారి భారీ విజయాన్ని అందుకోవు. కథ, కంటెంట్, ప్రేక్షకుల అంచనాలు అన్నీ కలిసొచ్చినప్పుడే వాటికి మంచి ఫలితం దక్కుతుంది. అదే సమయంలో మంచి వినోదాత్మక చిత్రానికి ప్రేక్షకులు భాష, ప్రాంతం అనే తేడా లేకుండా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పెద్ద సినిమాల మధ్యలో ఒక మంచి తెలుగు కమర్షియల్ ఎంటర్టైనర్ ఉండటం ఎన్టీఆర్ కెరీర్‌కు భిన్నమైన సమతూకాన్ని ఇవ్వవచ్చు.
అయితే అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి ఇదే కారణమని చెప్పలేం. కుటుంబ ప్రేక్షకులను తిరిగి ఆకట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును ఎంచుకున్నారని కూడా ఇప్పుడే నిర్ధారించలేం. కానీ ఈ కాంబినేషన్‌ను చూస్తుంటే ఎన్టీఆర్లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నంగా మాత్రం భావించవచ్చు.
అనిల్ రావిపూడికి కూడా ఇది సాధారణ సినిమా కాదు!
ఈ సినిమా అనిల్ రావిపూడికి కూడా పెద్ద బాధ్యతే. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా అంటే అభిమానుల అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆయన హీరోయిజానికి తగిన స్థానం ఇవ్వాలి. అదే సమయంలో అనిల్ సినిమాల్లో ఉండే కామెడీ, కుటుంబ భావోద్వేగాలు కూడా తగ్గకూడదు. కేవలం కామెడీ సన్నివేశాలతో సినిమా నడిపించడం కాకుండా, బలమైన కథలో ఎన్టీఆర్ నటనకు అన్ని రకాల అవకాశాలు కల్పించాలి.
ముఖ్యంగా ఎన్టీఆర్ కామెడీ టైమింగ్‌ను ఎంత బాగా ఉపయోగించుకుంటారన్నదే ఈ సినిమాకు కీలకం కావచ్చు. ‘అదుర్స్’ తరహా నవ్వులు, మంచి ఎమోషన్, అభిమానులు కోరుకునే హీరోయిజం.. ఈ మూడు అంశాలు కథలో సహజంగా కలిస్తే సినిమా ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది.
ఎన్టీఆర్‌కు కావాల్సింది కొత్త ఇమేజ్ కాదు.. మరో కోణం!
నవంబర్ 14న ఈ ప్రాజెక్టుపై ప్రకటన రావడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఎన్టీఆర్ స్వయంగా ‘This one’s going to be a laugh riot’ అంటూ స్పందించగా, అనిల్ రావిపూడి కూడా ‘Full-on entertainer’ అంటూ హింట్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి కథ, నటీనటులు, విడుదల తేదీ వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మొత్తానికి ఎన్టీఆర్ పాన్ ఇండియా ప్రయాణాన్ని పక్కనపెడుతున్నారని చెప్పడం తొందరపాటే. ఒకవైపు ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ వంటి దర్శకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు తెలుగు ప్రేక్షకులకు నచ్చే వినోదాత్మక సినిమాను కూడా చేయాలనుకోవడం మంచి కెరీర్ బ్యాలెన్స్ కావచ్చు.!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







