వారణాసిపైనే అందరి దృష్టి
రణబీర్ కపూర్ ‘రామాయణం’ థియేటర్లలోకి వచ్చిన తర్వాత పురాణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఇతర సినిమాల గురించి కూడా సోషల్ మీడియాలో కొత్త థియరీలు మొదలయ్యాయి. ముఖ్యంగా రాజమౌళి, మహేష్ బాబు ‘వారణాసి’ కథను రామాయణంతో లింక్ చేస్తూ అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. రావణుడికి చెందిన నవరత్నాల మాల చుట్టూ సినిమా కథ తిరుగుతుందనే ఓ థియరీ రెడ్డిట్‌లో ప్రచారంలోకి వచ్చింది. దీనికి పృథ్వీరాజ్ పోషిస్తున్న కుంభ పాత్రను కూడా కలిపారు. ఈ థియరీ ప్రకారం కుంభ పాత్ర కుంభకర్ణుడి పునర్జన్మ అట. గత జన్మలో రావణుడికి చెందిన నవరత్నాల మాలను తిరిగి సంపాదించు కోవడమే అతడి లక్ష్యమని ఊహిస్తున్నారు. ఆ మాలలో తొమ్మిది శక్తివంతమైన రత్నాలు ఉంటాయని, కాలక్రమంలో అవి ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలకు చేరుకున్నాయని కథ అల్లారు. వాటన్నింటినీ ఒకచోట చేర్చేందుకు కుంభ పెద్ద ప్లాన్ వేస్తాడట. అయితే ఆ రత్నాలను వెతికి తీసుకొచ్చే బాధ్యత మహేష్ పోషిస్తున్న రుద్ర పాత్రకు అప్పగిస్తాడని చెబుతున్నారు. దీంతో రుద్ర ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తుందట. ఇప్పటికే ‘వారణాసి’ కాన్సెప్ట్ వీడియోలో ప్రపంచంలోని వేర్వేరు ప్రదేశాలకు సంబంధించిన విజువల్స్ కనిపించాయి. వాటిని నవరత్నాల అన్వేషణతో కలిపి ఈ కథను తయారు చేశారు. ముఖ్యంగా తొమ్మిది రత్నాల కోసం తొమ్మిది ప్రాంతాల్లో రుద్ర సాహసాలు చేస్తాడనే ఊహ కూడా ఇందులో ఉంది.
మరోవైపు రాజమౌళి సినిమా వస్తుందంటే నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్ల మధ్య కూడా పోటీ మామూలుగా ఉండదు. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఆయన సినిమాలకు భారీ డిమాండ్ ఉంటుంది. గతంలో రాజమౌళి సినిమాల పంపిణీలో దిల్ రాజు కీలకంగా వ్యవహరించారు. భారీ ధర పెట్టి రైట్స్ కొనడంతో పాటు మంచి లాభాలు కూడా అందుకున్నారు. అయితే ఈసారి మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న ‘వారణాసి’ విషయంలో మాత్రం పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. గతంలో ‘బాహుబలి’ మొదటి భాగం నైజాం హక్కులను దిల్ రాజు దాదాపు రూ.25 కోట్లకు కొనుగోలు చేశారు. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో మంచి లాభాలు వచ్చాయి. అయితే రెండో భాగం హక్కులను మాత్రం ఆయన తీసుకోలేదు. అప్పట్లో సునీల్ నారంగ్ దాదాపు రూ.50 కోట్లకు నైజాం రైట్స్ దక్కించుకున్నారు. మొదటి భాగం కంటే రెట్టింపు ధర కావడంతో దిల్ రాజు ఆ డీల్‌కు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆరఆరఆర్ విషయంలో దిల్ రాజు మళ్లీ ముందుకొచ్చారు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన ఆ సినిమా నైజాం హక్కులను భారీ ధరకు తీసుకున్నారు. విడుదల తర్వాత నైజాంలోనే రూ.100 కోట్లకు పైగా షేర్ రావడంతో ఆయనకు మంచి లాభాలు దక్కాయి. దీంతో రాజమౌళి సినిమాల విషయంలో దిల్ రాజుకు మంచి అనుభవం ఉంది. ఇప్పుడు ‘వారణాసి’ రైట్స్ కోసం కూడా ఆయన పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈసారి మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం ఏకంగా రూ.290 కోట్ల డీల్ కుదిరిందని ప్రచారం జరుగుతోంది. మరికొన్ని రిపోర్ట్స్‌లో ఈ మొత్తం రూ.300 కోట్లుగా ఉంది. దిల్ రాజుతో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా పోటీపడినట్లు తెలుస్తోంది. చివరకు మైత్రీ సంస్థే ముందున్నట్లు వార్తలు వస్తున్నా ఈ డీల్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రొడక్షన్లో మంచి సక్సెస్‌లు అందుకుంది. ఇప్పుడు ఇతర నిర్మాతల పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడంలోనూ భారీ పెట్టుబడులు పెడుతోంది. అయితే ‘వారణాసి’ డీల్స్ మామూలుగా లేవని చెబుతున్నారు.
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇతర భాషల్లోనూ భారీ బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.







