జేబుల్లో రూపాయి కూడా ఉంచుకోవట్లేదా? మే నెలలో యూపీఐ నయా హిస్టరీ!
ఇప్పుడు మన దేశంలో కిరాణా కొట్టులో ఐదు రూపాయల చాక్లెట్ కొనాలన్నా, పెద్ద షాపింగ్ మాల్లో వేల రూపాయల వస్తువులు కొనాలన్నా జేబులో పర్సు వెతికే రోజులు పూర్తిగా పోయాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఒక్కసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంతో క్షణాల్లో పని ముగుస్తోంది. భారతీయులు క్యాష్ లెస్ లావాదేవీలకు ఏ రేంజ్లో అలవాటు పడిపోయారో చెప్పడానికి తాజాగా ఒక తిరుగులేని రికార్డు వెలుగులోకి వచ్చింది. మన దేశీయ డిజిటల్ చెల్లింపుల (UPI Payments) వ్యవస్థ ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (UPI) మే నెలలో సరికొత్త చరిత్ర సృష్టించింది.
మే నెలలో రూ. 30 లక్షల కోట్లు!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన తాజా అధికారిక గణాంకాల ప్రకారం.. మే నెలలో యూపీఐ (UPI Payments) ద్వారా జరిగిన మొత్తం లావాదేవీల విలువ అక్షరాలా రూ. 29.90 లక్షల కోట్లకు చేరి ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పింది. కేవలం ఒక్క నెలలోనే ఈ స్థాయి లావాదేవీలు జరగడం దేశీయ ఆర్థిక రంగంలోనే అతిపెద్ద మైలురాయి. ఏప్రిల్ నెలలో నమోదైన రూ. 29.03 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 3 శాతం అదనం కావడం గమనార్హం.
కేవలం విలువే కాదు, లావాదేవీల సంఖ్య (Volume)లోనూ యూపీఐ సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఏప్రిల్‌లో జరిగిన 2,235 కోట్ల లావాదేవీలతో పోలిస్తే, మే వచ్చేసరికి ఆ సంఖ్య ఏకంగా 4 శాతం వృద్ధితో 2,320 కోట్లకు ఎగబాకింది. 2016లో యూపీఐని అందుబాటులోకి తెచ్చినప్పటి నుంచి ఒకే నెలలో ఇంత భారీ స్థాయిలో లావాదేవీలు (UPI Payments) జరగడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా రోజువారీ సగటును లెక్కిస్తే.. ఏప్రిల్‌లో రోజుకు 74.5 కోట్ల లావాదేవీలు జరగ్గా, మే నెలలో ఆ సగటు రోజుకు 74.8 కోట్ల మార్కును తాకింది.
యూపీఐ జోరు.. మిగతా పేమెంట్స్ కుదేల్!
ప్రస్తుతం దేశీయ డిజిటల్ పేమెంట్స్ ఎకోసిస్టమ్‌లో యూపీఐ ఆధిపత్యం (UPI Payments) ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇతర సాంప్రదాయ చెల్లింపు వ్యవస్థల పతనమే నిదర్శనం. ఒకప్పుడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్లకు ఎక్కువగా వాడిన ఐఎంపీఎస్ (IMPS), ఆధార్ ఆధారిత ఏఈపీఎస్ (AePS) లావాదేవీలు మే నెలలో గణనీయంగా తగ్గిపోయాయి:
ఐఎంపీఎస్ (IMPS): ఏప్రిల్‌లో 36.2 కోట్లుగా ఉన్న ఐఎంపీఎస్ లావాదేవీల సంఖ్య మే నెలలో 35.8 కోట్లకు పడిపోయింది. వీటి మొత్తం విలువ కూడా రూ. 7.01 లక్షల కోట్ల నుంచి రూ. 6.96 లక్షల కోట్లకు క్షీణించింది.
ఏఈపీఎస్ (AePS): గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వాడే ఆధార్ ఆధారిత చెల్లింపులు ఏకంగా 6 శాతం మేర పడిపోయాయి. లావాదేవీల సంఖ్య 9.4 కోట్ల నుంచి 8.8 కోట్లకు తగ్గగా, వాటి విలువ రూ. 27,640 కోట్ల నుంచి రూ. 25,247 కోట్లకు మునిగిపోయింది.
వేసవి ప్రయాణాలతో ఫాస్టాగ్‌కు ఊపు!
యూపీఐ (UPI Payments) కాకుండా మే నెలలో సానుకూల వృద్ధిని నమోదు చేసింది కేవలం టోల్ ప్లాజాల వద్ద వాడే ‘ఫాస్టాగ్’ (FASTag) మాత్రమే. వేసవి సెలవులు, విహారయాత్రల కారణంగా మే నెలలో హైవేలపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఫలితంగా ఫాస్టాగ్ లావాదేవీలు 5 శాతం పుంజుకుని 37.5 కోట్లకు చేరాయి. వీటి ద్వారా వసూలైన మొత్తం టోల్ విలువ ఏకంగా రూ. 7,308 కోట్లకు పెరగడం విశేషం. మొత్తంగా చూస్తే, భారతదేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ (UPI Payments) ఇప్పుడు ఒక తిరుగులేని శక్తిగా మారిపోయింది. మిగతా డిజిటల్ వ్యవస్థలన్నీ కొన్ని ప్రత్యేక అవసరాలకు మాత్రమే పరిమితమవుతుండగా.. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు ప్రతి చోటా యూపీఐ సామ్రాజ్యమే నడుస్తోందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.








