సంతానోత్పత్తిపై స్మార్ట్ఫోన్ల ప్రభావం.. ‘ఐఫోన్’ రాకతో పడిపోయిన జననాల రేటు..!
ప్రపంచ గమనాన్ని మార్చేసిన అద్భుతమైన ఆవిష్కరణల్లో ‘స్మార్ట్ఫోన్’ ముందువరుసలో ఉంటుంది. అయితే దీనివల్ల కేవలం సమాచార సాంకేతిక విప్లవమే కాదు, మానవ సంబంధాలు, సామాజిక జీవన శైలిలోనూ ఊహించని మార్పులు వచ్చాయి. ముఖ్యంగా 2007లో ఆపిల్ సంస్థ ‘ఐఫోన్’ను (IPhones) మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత అమెరికాలో జననాల రేటు అనూహ్యంగా పడిపోయినట్లు ప్రతిష్టాత్మక ‘నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్’ (NBER) తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఎన్బీఈఆర్ పరిశోధన ప్రకారం.. అమెరికాలో 1980 నుంచి 2007 వరకు దాదాపు మూడు దశాబ్దాల పాటు జననాల రేటు స్థిరంగా కొనసాగింది. ఆ సమయంలో ప్రతి 1,000 మంది మహిళలకు సగటున 65 నుంచి 70 జననాలు నమోదయ్యేవి. కానీ సరిగ్గా 2007లో తొలితరం ఐఫోన్ (IPhones) విడుదలైన నాటి నుంచి ఈ రేటు క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది. ఆ పతనం ఎంత తీవ్రంగా ఉందంటే, 2024 నాటికి ప్రతి 1,000 మంది మహిళల్లో జననాల సంఖ్య ఏకంగా 54కి పడిపోయింది. అంటే కేవలం 17 ఏళ్ల వ్యవధిలోనే అమెరికాలో జననాల రేటు 22 శాతం మేర తగ్గిపోయింది.
అయితే ఈ తగ్గుదలకు నిజంగా ఐఫోనే (IPhones) కారణమా? అన్న కోణంలో పరిశోధకులు లోతైన విశ్లేషణ చేశారు. అమెరికాలో 2007 జూన్ నుంచి 2011 ఫిబ్రవరి వరకు ఐఫోన్ సేవలు కేవలం ‘ఏటీ అండ్ టీ’ (AT&T) సెల్యులార్ నెట్వర్క్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. ఈ పరిమితిని ఆధారంగా చేసుకుని పరిశోధకులు ఒక అంచనాకు వచ్చారు. ఏటీ అండ్ టీ నెట్వర్క్ కవరేజ్ పూర్తిగా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని జననాల రేటును, ఆ కవరేజ్ లేని ప్రాంతాలతో శాస్త్రీయంగా పోల్చి చూశారు. ఎక్కడైతే హై-స్పీడ్ మొబైల్ సిగ్నల్స్ ఉండి, యువత స్మార్ట్ఫోన్లకు విపరీతంగా అలవాటు పడ్డారో.. అక్కడే జననాల రేటు అత్యధికంగా పడిపోయినట్లు ఈ విశ్లేషణలో స్పష్టమైంది.
స్మార్ట్ఫోన్ల వినియోగం ప్రధానంగా యువతపై తీవ్ర ప్రభావం చూపింది. ఐఫోన్ (IPhones) అందుబాటులోకి రావడం వల్ల 15 నుంచి 19 ఏళ్ల లోపు యువతుల్లో జననాల రేటు 4.5 నుంచి 8 శాతం వరకు క్షీణించగా.. 20 నుంచి 24 ఏళ్ల వయసున్న వారిలో 3.2 నుంచి 6.6 శాతం మేర తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. మొత్తంగా చూసుకుంటే 2007-2011 మధ్య కాలంలో 15 నుంచి 44 ఏళ్ల వయసున్న మహిళల్లో సంతానోత్పత్తి రేటు పడిపోవడానికి 33 నుంచి 52 శాతం వరకు స్మార్ట్ఫోన్ల వాడకమే కారణమని ఎన్బీఈఆర్ అంచనా వేసింది. ఇక 2007 నుంచి 2024 నాటి దీర్ఘకాలిక లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఈ గణాంకాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ 17 ఏళ్లలో 15-19 ఏళ్ల వయసు వారిలో జననాల రేటు ఏకంగా 70 శాతం, 20-24 ఏళ్ల వారిలో 47 శాతం మేర పడిపోయింది.
మొత్తానికి స్మార్ట్ఫోన్లు కేవలం సమాచార సాధనాలుగా మాత్రమే మిగిలిపోలేదని, మనుషుల వ్యక్తిగత సమయాన్ని, మానవ సంబంధాలను హరించేస్తున్నాయని చెప్పడానికి ఈ అధ్యయనమే ఒక నిదర్శనం. యువత గంటల తరబడి స్మార్ట్ (IPhones) స్క్రీన్లకే అతుక్కుపోవడం వల్ల వ్యక్తిగత బంధాలు, సామాజిక సంబంధాలు తగ్గి.. అది పరోక్షంగా జననాల రేటు పతనానికి దారితీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతికత ఒక ‘బర్త్ కంట్రోల్’ సాధనంగా మారిందన్న అంతర్జాతీయ మీడియా విశ్లేషణలకు ఈ నివేదిక బలం చేకూరుస్తోంది.








