అప్పులు తీరిపోయాయని సంబరపడుతున్నారా? చాలామంది చేసే పొరపాటు ఇదే !
Financial Freedom : చాలామంది తమకున్న రుణాలన్నీ తీరిపోతే ఇక ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ ఉండవని, ఆర్థిక స్వేచ్ఛ వచ్చేసిందని భావిస్తుంటారు. అయితే, అప్పులు లేనంత మాత్రాన పూర్తి ఆర్థిక స్వేచ్ఛ సాధించినట్లు కాదని నిపుణులు చెప్తున్నారు. కేవలం ఒక మూడు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం ద్వారా అసలైన ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటో అవగాహన తెచ్చుకోవచ్చు.
1. రుణాలు లేకపోతే ఆర్థికంగా స్థిరపడినట్లేనా?
బ్యాంకు లోన్లు, క్రెడిట్ కార్డు బకాయిలు పూర్తిగా చెల్లించేయడం అనేది ఖచ్చితంగా ఒక పెద్ద విజయమే. అయినప్పటికీ, ఇది మాత్రమే పూర్తి ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వలేదు. ఎందుకంటే అప్పులు లేకపోయినా.. ప్రతి నెలా తప్పనిసరిగా కట్టాల్సిన ఇంటి అద్దె, స్కూలు ఫీజులు, బీమా ప్రీమియంలు, ఇతర అవసరాలు మన నెలవారీ సంపాదనలో చాలా భాగాన్ని హరించేస్తాయి. ఇవి నేరుగా అప్పులు కాకపోయినా, వీటిని భరించడానికి మనం స్థిరమైన జీతంపై పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది. ఒకవేళ ఖర్చులు పెరిగి, ఆదాయం తగ్గితే మళ్లీ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇవి కూడా చదవండి
2. వడ్డీ లేని రుణాలు భవిష్యత్తుకు భారం అవుతాయా?
ప్రస్తుతం వడ్డీ లేని సులభ వాయిదాల (No Cost EMI) పద్ధతిలో వస్తువులను కొనడం ఎక్కువగా కనిపిస్తోంది. ఇవి చూడటానికి అప్పుల్లా అనిపించవు కానీ, భవిష్యత్తులో డబ్బులు చెల్లించాల్సిన బాధ్యతను పెంచుతాయి. ఈ చిన్న చిన్న వాయిదాలు మన నెలవారీ నగదు నిల్వలను, పెట్టుబడులను పరిమితం చేస్తాయి. ఒకసారి విలాసవంతమైన ఇల్లు, ప్రయాణాలు, తరచుగా బయట భోజనం చేయడం వంటి జీవన శైలికి అలవాటు పడితే, ఆ ఖర్చులను తగ్గించుకోవడం చాలా కష్టం. తగినంత పొదుపు లేనప్పుడు ఇలాంటి ఖర్చులు అప్పుల్లా మారి, ఆర్థిక ప్రవాహంపై దెబ్బతీస్తాయి. ఇవి అనుకోని అవసరాలు వచ్చినప్పుడు పరిస్థితిని తట్టుకోలేక, మళ్ళీ నెలవారీ జీతంపైనే ఆధారపడేలా చేస్తాయి.
3. అసలైన ఆర్థిక స్వేచ్ఛను ఎలా గుర్తించాలి?
నిజమైన ఆర్థిక స్వేచ్ఛ అంటే కేవలం అప్పులు లేకుండా ఉండటం మాత్రమే కాదు. మన దగ్గర సరిపోయేంత పొదుపు ఉండాలి, అలాగే ఖర్చులు కూడా మన నియంత్రణలో ఉండాలి. ఆదాయానికి, ఖర్చులకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉండటమే అసలైన ఆర్థిక స్వేచ్ఛ. హఠాత్తుగా ఉద్యోగం కోల్పోవడం లేదా కొన్నాళ్ల పాటు ఎలాంటి ఆదాయం లేకపోవడం వంటి ఊహించని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఎలాంటి తీవ్రమైన ఒత్తిడికి గురికాకుండా ఉండగలగాలి. ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనేలా తగినంత ఆర్థిక పునాది (పొదుపు) ఉండాలి. అప్పుల్లాంటివి లేకుండా ఉండటం మంచిదే అయినప్పటికీ, సంపూర్ణ ఆర్థిక భద్రత సాధించడానికి అది మాత్రమే సరిపోదు. ఖర్చుల విషయంలో మనకు పూర్తి వెసులుబాటు ఉన్నప్పుడే నిజమైన ఆర్థిక స్వేచ్ఛ సాధ్యమవుతుంది.








