ATM Charges: ఏటిఎం నిబంధనల్లో మార్పులు, సామాన్యుడి జేబుకు చిల్లు..?
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఏటిఎం నిబంధనలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం కావడంతో పాటు, ఏప్రిల్ 1 నుంచి ఏటిఎం నగదు విత్ డ్రా, ఇతర సేవలపై బ్యాంకింగ్ రంగం కీలక మార్పులు తీసుకురాబోతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు తమ ఛార్జీలను, భద్రతా ఫీచర్లను అప్డేట్ చేస్తున్నాయి.
ఒక బ్యాంకు కస్టమర్ మరో బ్యాంకు ఏటిఎంలో డబ్బులు డ్రా చేసినప్పుడు, సదరు బ్యాంకు చెల్లించాల్సిన ‘ఇంటర్‌ఛేంజ్ ఫీజు’ను పెంచాలని నిర్ణయించారు. దీనివల్ల ఉచిత పరిమితి (Free Limits) దాటిన తర్వాత కస్టమర్లు చెల్లించాల్సిన ఛార్జీలు గతంలో కంటే 5 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో ఉచిత ఏటిఎం లావాదేవీల సంఖ్యపై బ్యాంకులు కొత్త పరిమితులను విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 3 లేదా 5 ఉచిత లావాదేవీల తర్వాత చేసే ప్రతి విత్‌డ్రాయల్‌పై ఛార్జీలు మరింత భారం కానున్నాయి.
ముఖ్యంగా ఆర్థికేతర లావాదేవీలు అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ, పిన్ మార్పు పైన(Pin Change) కూడా ఛార్జీలు పడే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి దాదాపు అన్ని ప్రధాన బ్యాంకు ఏటిఎంలలో యూపిఐ (UPI) ఆధారిత నగదు విత్ డ్రా సర్వీస్ ను తప్పనిసరి చేస్తున్నారు. డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే ఫోన్ పే(Phone Pe), గూగుల్ పే(Google pay) ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. ఇది ‘కార్డ్ స్కిమ్మింగ్’ వంటి మోసాలను అరికట్టడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఒకవేళ మీ ఖాతాలో బ్యాలెన్స్ లేనప్పుడు ఏటిఎంలో డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నించి, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే.. బ్యాంకులు గతంలో కంటే ఎక్కువ పెనాల్టీని వసూలు చేయనున్నాయి.
కాబట్టి నగదు డ్రా చేసే ముందు ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం తప్పనిసరి. ఏటిఎం సెంటర్లలో భద్రతను పెంచేందుకు వీలుగా ‘బయోమెట్రిక్’ లేదా ‘ఓటీపీ’ (OTP) ఆధారిత విత్‌డ్రాయల్స్ పరిమితిని రూ.5,000 కు తగ్గించవచ్చు. అంటే ఐదు వేల కంటే ఎక్కువ డ్రా చేయాలంటే ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం తప్పనిసరి కానుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, ఏటిఎం నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం బ్యాంకుల ప్రధాన ఉద్దేశ్యంగా కనపడుతోంది.








