మెక్సికో సరిహద్దుకు.. అమెరికా ఉపాధ్యక్షురాలు

అక్రమ వలసల కారణంగా ఎదురవుతున్న సమస్యలను పరిశీలించడానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అమెరికా-మెక్సికో సరిహద్దు వద్దకు వెళ్లారు. అక్రమ వలసలు పెరుగుతున్నా, దీన్ని పర్యవేక్షించాల్సిన ఆమె ఇంతవరకు సరిహద్దులను సందర్శించలేదంటూ ఇప్పటికే ప్రతిపక్ష రిపబ్లికన్లు విమర్శలు ప్రారంభించారు. జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ వలసలు పెరిగాయని ఆరోపించారు. ఈ విషయమై సొంత పార్టీ డెమొక్రాట్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె జరిపిన ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది. కస్టమ్స్, సరిహద్దు రక్షణ దళం ఏజెంట్లతో ఆమె ముచ్చటించారు. వలసదార్ల కదలికలను గుర్తించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నందుకు ఆమె వారిని అభినందించారు.